108 అంబులెన్స్‌లో పండంటి ఆడబిడ్డ జననం…

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి ఒక నిండు ప్రాణానికి ఊపిరి పోయడమే కాకుండా, ఓ కుటుంబంలో ఆనందాన్ని నింపింది. మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన మంత్రి అనూషకు శుక్రవారం ఉదయం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు ఉదయం 6:07 గంటలకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన చిలకలూరిపేట 108 వాహనం అక్కడికి చేరుకుని, అనూషను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగన్నపాలెం వద్ద నొప్పులు తీవ్రతరమయ్యాయి.

పరిస్థితిని గమనించిన EMT యడ్ల శోభన్‌బాబు, వాహనాన్ని రోడ్డు పక్కన నిలపాలని పైలట్ టి. శివనాగాంజనేయులకు సూచించారు. అనంతరం అంబులెన్స్‌లోనే వైద్య సేవలు అందించి సుఖ ప్రసవం నిర్వహించారు. దీంతో అనూష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న అనంతరం వారిని నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. అనూషకు ఇది రెండో ప్రసవం కాగా, మొదటి సంతానం మగబిడ్డ. ఇప్పుడు ఆడబిడ్డ పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

క్లిష్ట సమయంలో అండగా నిలిచిన 108 అంబులెన్స్ సిబ్బందికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా 108 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రాజేంద్రప్రసాద్ విధి నిర్వహణలో ప్రతిభ చాటిన సిబ్బందిని అభినందించారు.

Leave a Reply