Telangana Economy | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పెరుగుతున్న ఆందోళన

Telangana Economy | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పెరుగుతున్న ఆందోళన

Telangana Economy | లక్ష్యాన్ని దాటిన అప్పులు.. ఆదాయంలో భారీ లోటు
కేంద్ర నిధుల కొరత.. రుణాలపై పెరుగుతున్న ఆధారపడటం
రికార్డు స్థాయిలో రుణ సమీకరణ.. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై హెచ్చరిక

Telangana Economy | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ ఖర్చులకూ అప్పులపైనే ఆధారపడుతోంది. జులై 1న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లు రుణం తీసుకోనున్నది. ప్రతినెలా ఆర్బీఐ నుంచి రూ.6,000 కోట్లకుపైగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం గతేడాది కూడా బడ్జెట్ ప్రతిపాదనలకు మించి 143.98 శాతం అప్పులు తీసుకుంది. ఈసారి కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో అప్పులే దిక్కుగా మారుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఆదాయ అంచనాలను ప్రభుత్వం అందుకోలేకపోయింది.

లక్ష్యానికి మించి అప్పులు

గతేడాది రూ.54,009.74 కోట్ల అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా రూ.77,762.35 కోట్లు అప్పు తెచ్చింది. అంటే 143.98 శాతం మేర అదనంగా అప్పులు చేసింది. బడ్జెట్‌లో రూ.2.84 లక్షల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా, రూ.2.6 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఇందులో సింహభాగం అయిన రూ.77,762 కోట్లు అప్పులు, ఇతర రుణ బాధ్యతల ద్వారానే రావడం గమనార్హం.

బడ్జెట్‌లో రూ.2,738 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ఆశించగా, చివరకు రూ.9,235 కోట్ల రెవెన్యూ లోటుతో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ద్రవ్యలోటు రూ.77,762 కోట్లకు చేరగా, దీనిని అప్పుల ద్వారా ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఇక ప్రాథమిక లోటు అంచనా వేసిన రూ.34,640 కోట్ల కంటే 138.80 శాతం పెరిగి రూ.48,082 కోట్లుగా నమోదైంది.

రెవెన్యూ రాబడులు రూ.1.81 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇది బడ్జెట్ అంచనా అయిన రూ.2.29 లక్షల కోట్ల కంటే రూ.38,000 కోట్లు తక్కువ. మరోవైపు, అప్పులు, ఇతర రుణాల రూపంలో వచ్చే మూలధన రాబడులు అంచనా వేసిన రూ.55,116 కోట్ల కంటే గణనీయంగా పెరిగి రూ.78,197 కోట్లకు చేరుకున్నాయి.

కేంద్ర నిధులు రాబట్టుకోవడంలోనూ విఫలం

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్, ఇతర సహకారం బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.22,782 కోట్లలో కేవలం రూ.10,422 కోట్లు (45.75 శాతం) మాత్రమే వచ్చాయి. రిజర్వు బ్యాంకు విడుదల చేసిన క్యూ-2 క్యాలెండర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జులైలోనే రికార్డు స్థాయిలో రుణ సమీకరణ చేయనున్నది. జులై 1న రూ.7,000 కోట్లు, జులై 14న మరో రూ.3,500 కోట్లు, జులై 28న మరో రూ.1,000 కోట్లు ఓపెన్ మార్కెట్ కింద అప్పు తీసుకోనున్నది. ఇలా ఒక్క జులైలోనే రూ.11,500 కోట్లు రుణ సమీకరణ చేయనుంది.

అలాగే ఆగస్టులో రెండు దఫాలుగా రూ.4,500 కోట్లు, సెప్టెంబరులో రెండు దఫాలుగా రూ.2,500 కోట్ల చొప్పున మొత్తం రూ.5,000 కోట్లు తీసుకోనున్నది. ఇలా క్యూ-2లో మొత్తం రూ.21,000 కోట్లు ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పులు చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో రూ.73,383 కోట్ల మొత్తాన్ని ఓపెన్ మార్కెట్ రుణాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఓపెన్ మార్కెట్ రుణాలు రూ.73,383 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు రూ.5,500 కోట్లు, ఇతర వనరుల ద్వారా రుణాలు రూ.1,000 కోట్లు.. ఇలా మొత్తం రూ.79,884 కోట్ల రుణాలు తీసుకుంటామని ప్రతిపాదించారు.

ఈ మొత్తం రుణం రాష్ట్ర మొత్తం రాబడుల అంచనాల్లో దాదాపు 25 శాతానికి సమానం కావడం గమనార్హం. బడ్జెట్ అంచనాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో పాత అప్పుల చెల్లింపుల కోసం రూ.23,025 కోట్లు కేటాయించగా, నికర రుణాలు రూ.56,959 కోట్లుగా ఉండనున్నాయి.

అంచనా వేసిన ఆదాయం (రూ.2.84 లక్షల కోట్లు) రాకపోవడం, అనుకున్న దానికంటే తక్కువగా ఖర్చు (92.95 శాతం) చేసినప్పటికీ లోటు పెరగడం గమనార్హం. అప్పుల ద్వారానే ద్రవ్యలోటును సర్దుబాటు చేయడం తెలంగాణ భవిష్యత్తు ఆర్థిక స్థితికి గొడ్డలిపెట్టులా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.