కస్తూర్బా విద్యాలయాల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
- దండేపల్లి కేజీబీవీని తనిఖీ చేసిన జిల్లా సెక్టోరియల్ అధికారి కె. విజయలక్ష్మి
దండేపల్లి, ఆంధ్రప్రభ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా సెక్టోరియల్ అధికారి కె. విజయలక్ష్మి సూచించారు.
మంగళవారం ఆమె దండేపల్లి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని తరగతి గదులు, వంటశాల, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యత, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం విద్యాలయ ప్రత్యేక అధికారిణి కవితతో మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు వచ్చే బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతులు అందించడం ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.
విద్యార్థినులకు దిశానిర్దేశం..
విద్యార్థినులతో ముచ్చటించిన విజయలక్ష్మి, చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో పాటు కఠోర శ్రమ ఉంటేనే మంచి ఫలితాలు సాధించవచ్చని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రత్యేక అధికారిణి కవిత, సీఆర్టీలు, సిబ్బంది పాల్గొన్నారు.
