Aadhaar Linked SIM | ప్రతి మొబైల్ యూజర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం!
Aadhaar Linked SIM | ప్రతి మొబైల్ యూజర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం!
Aadhaar Linked SIM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మీ ఆధార్ కార్డుతో ఎన్ని నెంబర్లు ఉన్నాయో అని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా..? లేదంటే వెంటనే చెక్ చేసుకోండి. మొబైల్ ఫోన్ వినియోగం పెరిగి పోవడంతో సైబర్ నేరగాళ్లు మరో కొత్త రకం మోసాలకు తెర లేపారు. అవునండీ మీ ఆధార్ నెంబర్ తో మనకు తెలియకుండానే వేరే సిమ్ నెంబర్లు తీసుకొని మోసలకు పాల్పడుతున్నారు. మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ కార్డు తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి సమస్యలను ముందుగానే నివారించేందుకు మీ ఆధార్‌తో ఎన్ని మొబైల్ నంబర్లు నమోదు అయ్యాయో తరచుగా పరిశీలించడం చాలా అవసరం.
దీనికోసం కేంద్ర ప్రభుత్వం టెలికాం శాఖ TAF-COP (Telecom Analytics for Fraud Management and Consumer Protection) అనే ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ పేరుతో నమోదైన మొబైల్ కనెక్షన్ల వివరాలను కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు.
TAF-COP అంటే ఏమిటి?
టఫ్ కొప్ (TAF-COP)అనేది టెలికాం వినియోగదారుల భద్రత కోసం రూపొందించిన అధికారిక ఆన్‌లైన్ సేవ పోర్టల్. దీని ద్వారా ఒక వ్యక్తి గుర్తింపు పత్రాలతో ఎన్ని మొబైల్ కనెక్షన్లు యాక్టివ్‌లో ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ తీసుకున్నట్లు అనుమానం ఉంటే, అదే పోర్టల్‌లో ఫిర్యాదు కూడా చేయవచ్చు.
మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఎలా చెక్ చేయాలి?
ముందుగా TAF-COP ఆన్‌లైన్ సేవ పోర్టల్ ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటిపిని నమోదు చేసి ధృవీకరణ పూర్తి చేయండి. అనంతరం లాగిన్ అయిన తర్వాత మీ పేరుతో నమోదైన మొబైల్ కనెక్షన్ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
తెలియని నంబర్ కనిపిస్తే ఏం చేయాలి?
జాబితాలో మీకు తెలియని లేదా మీరు ఉపయోగించని మొబైల్ నంబర్ కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే సంబంధిత నంబర్‌ను ఎంపిక చేయండి. “Report” లేదా ఫిర్యాదు చేసే ఆప్షన్‌ను ఎంచుకొని మీ ఫిర్యాదును సమర్పించండి. అనంతరం సంబంధిత టెలికాం సంస్థ ఆ నంబర్‌పై విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. విచారణ పూర్తయ్యాక సిమ్ కు సేవలు నిలిపివేయడం, డిస్కనెక్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించవచ్చు.
ఒక వ్యక్తి పేరుతో ఎన్ని సిమ్‌లు ఉండవచ్చు?
భారత టెలికాం నిబంధనల ప్రకారం సాధారణంగా ఒక వ్యక్తి పేరుతో గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు నమోదు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ పరిమితి తక్కువగా ఉండవచ్చు. ఈ పరిమితిని మించి కనెక్షన్లు ఉంటే టెలికాం శాఖ అదనపు ధృవీకరణ చేపట్టే అవకాశం ఉంది.
ఎందుకు తరచూ చెక్ చేయాలి?
మీ ఆధార్‌తో నమోదైన సిమ్‌ల వివరాలను పరిశీలించడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
- సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.
- మీ పేరుతో అక్రమంగా తీసుకున్న సిమ్‌లను గుర్తించవచ్చు.
- ఓటీపీలు, బ్యాంకింగ్ సేవలు, యూపీఐ వంటి డిజిటల్ సేవల భద్రత పెరుగుతుంది.
- వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నివారించవచ్చు.
- భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు.
మీ పేరుతో నమోదైన సిమ్‌ను ఇతరులు ఉపయోగిస్తే… వాటితో సైబర్ మోసాలకు వినియోగించే అవకాశం అధికం. బ్యాంక్ మోసాలు, ఓటీపీ మోసాల్లో ఉపయోగించే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో నేర కార్యకలాపాల్లో ఆ సిమ్ వినియోగిస్తే విచారణ సమయంలో మీ పేరు కూడా రావచ్చు. మీ వ్యక్తిగత గుర్తింపు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.
నిపుణుల సూచనలు..
- ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి మీ పేరుతో నమోదైన సిమ్‌ల వివరాలను చెక్ చేయండి.
- ఉపయోగంలో లేని సిమ్‌లను వెంటనే డిస్కనెక్ట్ చేయించండి.
- మీ ఆధార్, ఓటీపీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వకండి.
- కేవైసీ కోసం గుర్తింపు పత్రాలను అధికారిక కేంద్రాల్లో మాత్రమే సమర్పించండి.
