అడుగంటుతున్న భూగర్భ జలాలు…!

అడుగంటుతున్న భూగర్భ జలాలు…!

గ్రామాల్లో నెలకొని ఉన్న తాగునీటి ఎద్దడి…!
ప్రభుత్వానికి (ని) వేదన …!
పైసా విడుదల చేయని వైనం…!
సమీక్షలతో “సరి”… పరిష్కారానికి ఏది “దారి”…!

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : వేసవికాలం వచ్చిందంటే… పల్నాడు పల్లె వాసులు గుక్కెడు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి… ఇది ప్రతి ఏడాది ఉండే పరిస్థితి అయినప్పటికీ… అధికారుల్లో ఎటువంటి చలనం లేదనే చెప్పాలి. పల్నాడు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై సమీక్షలు జరుపుతూ… ప్రభుత్వానికి నివేదికలు పంపుతూ… చేతులు దులుపుకుంటున్నారే తప్ప… సమస్య పరిష్కారానికి ఏమాత్రం కనికరం చూపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రోజు రోజుకి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల తవ్వకాన్ని నిషేధిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి తవ్వకం చేపడితే “వాల్టా” చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వు లో పేర్కొంది. గ్రామాల్లో నెలకొని ఉన్న మంచినీటి ఎద్దడి నివారణకు గత ఏడాది డిసెంబర్ లో జిల్లా ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అయినా కూడా నేటికీ ఒక్క పైసా కూడా విడుదల కానీ పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలను 110 ఉన్నాయని గుర్తించి, వాటిల్లో 47 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఏడాది జూన్ మాసం వరకు నీటి సమస్య పరిష్కారానికి సుమారుగా 4.68 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

పల్నాడు జిల్లాలో….
మండలాల సంఖ్య:- 28
పురపాలక సంఘాలు:- 6
నగర పంచాయతీలు:- 2
గ్రామ పంచాయతీలు:- 526
మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాలు:-110
రక్షిత మంచినీటి పథకాలు:- 355
పంపిణీ పాయింట్లు:- 1927
సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు:-49
రక్షిత తాగునీటి చెరువులు:- 131
నీటి నిల్వ ఉన్న చెరువులు:-80 (100 శాతం)
70 శాతం వరకు నీరు నిల్వ ఉన్న చెరువులు:-46.

మిగిలిన చెరువులు నీరు లేక ఎండిపోయాయి. కాగా గ్రామాల్లో మంచినీరు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదని స్పష్టమవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఐదు మండలాల్లోని 20 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే “వాల్టా” చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

నిషేధించిన గ్రామాల జాబితా ఇది:-

  1. మాచర్ల మండలంలో :- రాయవరం
  2. వెల్దుర్తి మండలంలో:- వెల్దుర్తి, ఉప్పలపాడు, గుండ్లపాడు, గొట్టిపాల, కండ్లకుంట, మండాది, పట్ల వీడు, రాచమల్లపాడు, సిరిగిరిపాడు.
  3. దుర్గి మండలంలో:- ఆత్మకూరు, కోలగుట్ల, పోలేపల్లి.
  4. అచ్చంపేట మండలంలో:- చిగురుపాడు, తాళ్ళచెరువు.
  5. బొల్లాపల్లి మండలంలో:- గండి గనుముల, గుమ్మనంపాడు, గుట్లపల్లి, రావులాపురం, రేమిడిచర్ల.
    ఈ గ్రామాలలో కొత్త బోర్లతో తవ్వకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బట్టి చూస్తే పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి మంచినీటి సమస్యకు పరిష్కార మార్గాలను చూపాలని పల్నాడు ప్రాంత వాసులు సర్వత్ర కోరుతున్నారు.

Leave a Reply