పంచాయతీ భవనం గ్రామ స్వరాజ్యానికి ప్రతీక
పంచాయతీ భవనం గ్రామ స్వరాజ్యానికి ప్రతీక
- ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు
డోంగ్లి, ఆంధ్రప్రభ: గ్రామ పంచాయతీ భవనం గ్రామ స్వరాజ్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు అన్నారు. డోంగ్లి మండలం మరేపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
గ్రామస్తుల చిరకాల వాంఛగా ఉన్న ఈ భవనం ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిందని తెలిపారు. ఇకపై జనన, మరణ ధ్రువీకరణలు, ఆస్తి పన్ను, ప్రభుత్వ పథకాల దరఖాస్తులు వంటి అన్ని సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరేపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఏళ్లుగా అద్దె భవనంలో పంచాయతీ కార్యాలయం నడిచేదని, ఇప్పుడు సొంత భవనం రావడం గ్రామానికి పెద్ద అభివృద్ధి అని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గ్రామ పెద్దలు కొనియాడారు.
భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భవనాన్ని పూలతో అలంకరించారు. యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, స్థానిక సర్పంచ్ శ్రీధర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బాచావార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.
