కల్లు మండువలో దారుణం..
కల్లు మండువలో దారుణం..
- వ్యక్తిని వేటకొడవలితో హత్య
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఓ కల్లు మండువలో జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. గోడిశాల విజయ్ (30)పై అక్కినపల్లి అఖిల్ (31) వేటకొడవలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన విజయ్ను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్, అఖిల్ ఇద్దరూ కల్లు సేవిస్తున్న సమయంలో వ్యక్తిగత కారణాలతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అఖిల్ ముందస్తు పథకం ప్రకారం వేటకొడవలితో విజయ్ మెడపై దాడి చేసినట్లు సమాచారం.
ఘటన అనంతరం నిందితుడు అఖిల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
