2012 Nirbhaya incident | కదులుతున్న బస్సులో మహిళపై…
2012 Nirbhaya incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. 2012 నిర్భయ ఘటనను గుర్తు చేసేలా రాణీబాగ్ ప్రాంతంలో ఓ మహిళపై ప్రైవేట్ బస్సులో డ్రైవర్, కండక్టర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలిని రాత్రంతా బస్సులో తిప్పుతూ అమానుషంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు.
పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సరస్వతి విహార్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉన్న మహిళను ప్రైవేట్ బస్సులోకి బలవంతంగా లాగిన డ్రైవర్, కండక్టర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాణీబాగ్ నుంచి నాంగ్లోయ్ వరకు బస్సును తిప్పుతూ కదులుతున్న వాహనంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి బస్సును గుర్తించారు. కొన్ని గంటల్లోనే బస్సును సీజ్ చేసి డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ ఘటనతో ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ఢిల్లీలో రాత్రివేళ ప్రయాణించే మహిళల్లో భయం నెలకొంది. ప్రైవేట్ బస్సుల పర్యవేక్షణపై కఠినమైన నిబంధనలు ఉండాలని మహిళా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
