కారు ఢీకొని తల్లి మృతి

కారు ఢీకొని తల్లి మృతి

కుమారుడికి తీవ్ర గాయాలు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కిలేశపురం గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సేకరించిన సమాచారం ప్రకారం.. కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి గంగాభవాని (44) తన ఇంటికి వచ్చిన బంధువులను సాగనంపేందుకు పెద్ద కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి జాతీయ రహదారిపైకి వచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి వారిని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గంగాభవాని అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారులోనే అతన్ని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.