గుట్ట‌లు గుట్ట‌లుగా నోట్ల క‌ట్ట‌లు…

  • బొగ్గు వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్ల నగదు స్వాధీనం
  • 31 ప్రాంతాల్లో సోదాలు..
  • రూ. 600 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

ఆంధ్రప్రభ : జార్ఖండ్‌లో బొగ్గు మాఫియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపింది. అనుమానిత ఆర్థిక అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు ధన్‌బాద్ జిల్లాలోని 31 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ ప్రముఖ బొగ్గు వ్యాపారి నివాసంలో సుమారు రూ.100 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే నగదు, స్థిరాస్తులు, కీలక పత్రాలు కలిపి రూ.600 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో ఇప్పటివరకు ఈడీ చేపట్టిన చర్యల్లో ఇదే అతిపెద్ద రికవరీగా అధికారులు భావిస్తున్నారు.

ఈడీ బృందాలు ధన్‌బాద్‌లోని ఝరియా, కెండూవా, లోయబాద్, మెమ్కో మోర్ తదితర ప్రాంతాల్లోని బొగ్గు వ్యాపారులు, వారి సహచరులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల రికార్డులు, వ్యాపార పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఝరియాలోని యాదవ్ సోదరులు, కెండూవాలోని మండల్ సోదరులు, లోయబాద్‌లోని చౌహాన్ సోదరులతో సంబంధం ఉన్న ప్రాంగణాల్లో కూడా ఈడీ తనిఖీలు చేపట్టింది. లోయబాద్‌లో ఒకచోట అధికారులు చేరుకోగానే స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భద్రతా సిబ్బంది సహాయంతో అధికారులు సోదాలను కొనసాగించారు.

మరోచోట ఇంటి యజమానులు తలుపులు తెరవకపోవడంతో అధికారులు నిచ్చెన సాయంతో ఇంట్లోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. మెమ్కో మోర్ సమీపంలోని నలంద కాటేజ్‌లో కూడా ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఈడీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల తుది వివరాలను కూడా ప్రకటించాల్సి ఉంది. అయినప్పటికీ ధన్‌బాద్‌లో నిర్వహించిన ఈ భారీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.