పాడి రైతులపై బకాయిల భారం..
పాడి రైతులపై బకాయిల భారం..
- బిల్లుల కోసం ఎదురు చూపులు..
- అప్పుల బాటలో పాడి రైతులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్ర పరిధిలోని పాడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లులు కోటి రూపాయలకు పైగా బకాయిగా ఉండటంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 45 రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. బిల్లులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న రైతులు అప్పులపాలై వడ్డీ భారం మోస్తున్నారు.

అచ్చంపేట పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 680 మంది పాడి రైతులు ప్రతిరోజూ దాదాపు 6,500 లీటర్ల పాలను పాలశీతలీకరణ కేంద్రానికి సరఫరా చేస్తున్నారు. పశువులకు మేత, మందులు, నిర్వహణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ బిల్లులు ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. “పాలు మాత్రం ప్రతిరోజూ తీసుకుంటున్నారు… బిల్లులు మాత్రం నెలన్నరగా ఇవ్వడం లేదు. ఇలా అయితే పాడి పరిశ్రమ ఎలా కొనసాగించాలి?” అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
