ఎరువుల కంపెనీల ‘లింకు’ల దోపిడీ..

ఎరువుల కంపెనీల ‘లింకు’ల దోపిడీ..
- కుప్పకూలుతున్న రిటైల్ వ్యవస్థ
- సంక్షోభంలో అన్నదాత
పరకాల, ఆంధ్రప్రభ : ఎరువుల కంపెనీల ‘లింకు’ విధానాలు, స్వార్థపూరిత వ్యాపార తంత్రాల కారణంగా గ్రామీణ రిటైల్ ఎరువుల వ్యాపారం పూర్తిగా దివాలా అంచున నిలిచిందని, దీని ప్రత్యక్ష ప్రభావం అన్నదాతపై పడుతోందని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరియు డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం స్టేట్ అసోసియేషన్‌కు సమస్యలను నివేదిస్తూ ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.
రిటైల్ డీలర్లను కోలుకోలేని దెబ్బ కొడుతున్న కంపెనీలు:
- మార్జిన్ల కోత – బతుకు భారం
గత రెండేళ్లుగా ప్రముఖ కంపెనీలు రిటైల్ డీలర్ల మార్జిన్లను నామమాత్రం చేశాయి. హోల్‌సేల్ వ్యాపారులు నేరుగా ఎమ్మార్పీకే అమ్ముతుండటంతో, రవాణా, గోడౌన్, కరెంటు బిల్లులు కూడా గిట్టుబాటు కాక డీలర్లు దుకాణాలకు తాళాలు వేసే దుస్థితి దాపురించింది. - రైతు వ్యతిరేక ‘లింకు’ ల మాఫియా:
రైతుకు ప్రాణాధారమైన యూరియాను కావాలంటే డిమాండ్ లేని నాసిరకం ఉత్పత్తులను బలవంతంగా కొనాలని కంపెనీలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయి. ఈ అనైతిక ‘లింకు’ల విధానం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అమ్ముడుపోని సరుకుతో గోడౌన్లు నిండిపోయి డీలర్లు అప్పులపాలవుతున్నారు. - కృత్రిమ కొరత – రైతు కన్నీరు
సీజన్ మొదలయ్యే సమయానికి కంపెనీలు ఉద్దేశపూర్వకంగా యూరియా, డీఏపీ కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. తమ పాత స్టాక్, నాసిరకం సరుకును వదిలించుకోవడానికి డీలర్లను పావులుగా వాడుకుంటున్నాయి. ఫలితంగా రైతు సకాలంలో ఎరువులు అందక పంట చేనులోనే ఎండిపోయే పరిస్థితి దాపురించింది.
మా ప్రధాన డిమాండ్లు
‘లింకు’ విధానం వెంటనే రద్దు, యూరియా సరఫరాకు ఎలాంటి షరతులు పెట్టవద్దు. రైతుకు కావాల్సిన ఎరువును మాత్రమే ఇవ్వాలి. గౌరవప్రదమైన మార్జిన్, పెరిగిన నిర్వహణ ఖర్చులకు తగ్గట్టుగా రిటైల్ డీలర్లకు కనీసం 8-10% న్యాయమైన మార్జిన్ కల్పించాలి.
పారదర్శక సరఫరా ప్రతి జిల్లాకు, మండలానికి ఎంత స్టాక్ వచ్చింది, ఎవరికి ఇచ్చారో ఆన్‌లైన్‌లో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. మార్క్ ఫెడ్ ద్వారా గవర్నమెంట్ షాప్స్ కి ఇచ్చు రేట్స్ కంపెనీ వారు హోల్ సేల్ డీలర్స్ ద్వారా రిటైల్ డీలర్స్ కి ఇవ్వాలి.
తుది హెచ్చరిక ఇది కేవలం డీలర్ల సమస్య కాదు – గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనుగడ ప్రశ్న, రైతు బతుకు ప్రశ్న అని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరియు డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
