అకాల వర్షానికి తడిచి ముద్దైన ధాన్యం.

అకాల వర్షానికి తడిచి ముద్దైన ధాన్యం.

– ఈదురుగాలులతో భారీ వడగాళ్ల వర్షం
– కొనుగోలు కేంద్రాల్లో పట్టాలు కప్పేలోపే తీవ్ర నష్టం
– పలు చోట్ల నేలరాలిన మామిడి
– ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల డిమాండ్‌.

దండేపల్లి, ఆంధ్రప్రభ : అసలే మండు వేసవి కాలం. ఏ సమయంలోనైనా వడగండ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి తరలించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా కూలీలు, లారీల కొరత పేరుతో తూకం నిలిపివేయడంతో ఎక్కడికుప్పలు అక్కడే ఉండిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఉరుములు మెరుపులతో కురిసిన వడగాళ్ల వానకు వరి ధాన్యం, మొక్క జొన్నలు, తదితర పంటలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వర్షం ఆకస్మాత్తుగా కురవడంతో కుప్పల పై కవర్లు టార్పాలి లు కప్పుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది.

ఆరుగాలం చెమటోడ్చి చీడపీడలు, ప్రకృతి ప్రకోపాల దాటి నుంచి పంటలు పండించడం ఒక ఎత్తయితే. వాటిని సకాలంలో తూకం వేయించడం మరో ఎత్తు అవుతుందని రైతులు వాపోతున్నారు. మ్యాచర్‌ వచ్చినా.. మళ్లీ వర్షం కురవడంతో ధాన్యం తడిచిందని జిల్లా యంత్రాంగం తీరుతో తాము పూర్తిగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా ఈదురుగాలులతో పలు చోట్ల మామిడి నేలరాలింది. మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాలు మాదాపూర్, ధర్మరావుపేట, లక్ష్మీకాంతపూర్, మామిడిపల్లి, లింగాపూర్, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది.

2 గంటల పాటు వడగండ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. కొన్నిచోట్ల వరి పంట నేలకొరిగింది. గాలివాన బీభత్సవంతో రాత్రి నుంచి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలవద్ద తడిసిన ధాన్యాన్ని రైతు వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.