పోలియో నిర్మూలనకు ప్రతి తల్లిదండ్రి సహకరించాలి..
- మండల వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక
దిలావర్‌పూర్, ఆంధ్రప్రభ : పోలియో నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని మండల వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ అక్షరా అనిల్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు, ప్రజలు ఆరోగ్య శాఖ సిబ్బందికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేశ్వర్, ఏఎన్‌ఎం పుష్ప, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
