రాజన్న సిరిసిల్ల జిల్లాకు మహర్దశ..
వేములవాడ/సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో కీలక అభివృద్ధి అధ్యాయానికి గురువారం శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో రూ.15.22 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే రూ.1.65 కోట్లతో చేపట్టనున్న వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పర్యవేక్షణలో ఈ పనులు పూర్తయ్యాయి. జిల్లాలో పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధికి ఇవి మరింత ఊతమివ్వనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఆధ్యాత్మికత–ఆహ్లాదానికి గుడి చెరువు బండ్ పార్క్..
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నిధులతో రూ.12 కోట్ల వ్యయంతో గుడి చెరువు బండ్ పార్క్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేశారు. ఇందులో 40 అడుగుల మహాశివుడి విగ్రహం, సప్తమాతృకల విగ్రహాలు, నటరాజ ఫౌంటెన్, వాకింగ్ ట్రాక్, అంఫి థియేటర్, ల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయి.
రగుడు బైపాస్ జంక్షన్‌కు కొత్త రూపు..
రూ.3.10 కోట్లతో అభివృద్ధి చేసిన రగుడు బైపాస్ జంక్షన్‌ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. వస్త్ర తయారీ ప్రక్రియను ప్రతిబింబించే శిల్పాలు, ప్రత్యేక నమూనాలు, హైమాస్ట్ లైట్లు, గ్రీనరీ, రోడ్డు భద్రతా చర్యలు ఈ జంక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రయాణికులకు ఆధునిక బస్ షెల్టర్లు
రగుడు బైపాస్ జంక్షన్ వద్ద కరీంనగర్, కామారెడ్డి రహదారులపై రూ.12.50 లక్షలతో ఆధునిక మోడల్ బస్ షెల్టర్లను నిర్మించారు. జిల్లా సమీకృత కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలతో పాటు సాధారణ ప్రయాణికులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
వేములవాడ బస్టాండ్‌కు కొత్త హంగులు
రూ.1.65 కోట్లతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన జరగనుంది. కార్యాలయ గదుల నిర్మాణం, బస్టాండ్ సుందరీకరణ, పచ్చదనం పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే వేములవాడలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు, భక్తులు, ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
