రూ.1.97 లక్షల కోట్లకు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ..

  • ప్రపంచంలో రెండో అత్యంత విలువైన లీగ్‌గా ఐపీఎల్

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ టీ-20 లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యాపార విలువ భారీగా పెరిగింది. అమెరికాకు చెందిన పెట్టుబడి బ్యాంక్ ‘హౌలిహాన్ లోకీ’ (Houlihan Lokey) నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ దాదాపు 11శాతం పెర‌గ‌గా.. IPL ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రభ : ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన లీగ్‌గా నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యాపార విలువ ఈ ఏడాది మరోసారి భారీగా పెరిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకే (Houlihan Lokey) విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం, ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ 20.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు)కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11 శాతం పెరుగుదల కావడం విశేషం.

ఏడాదికేడాది పెరుగుతున్న ఐపీఎల్ విలువ

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేడు ప్రపంచ క్రీడా రంగంలో అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఫ్రాంచైజీల విలువ, డిజిటల్ ఆదాయం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రేక్షకాదరణతో ఐపీఎల్ వ్యాపార విలువ ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది.

2023 – రూ.1.47 లక్షల కోట్లు
2024 – రూ.1.57 లక్షల కోట్లు
2025 – రూ.1.77 లక్షల కోట్లు
2026 – రూ.1.97 లక్షల కోట్లు

వరుసగా రెండో ఏడాది కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో… ఐపీఎల్ ప్రపంచ క్రీడా వ్యాపార రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

ఎన్‌ఎఫ్‌ఎల్ తర్వాత రెండో స్థానం

మ్యాచ్‌కు లభిస్తున్న వ్యాపార విలువ ఆధారంగా పరిశీలిస్తే, అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన క్రీడా లీగ్‌గా ఐపీఎల్ నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఐపీఎల్ బ్రాండ్‌కు పెరుగుతున్న ఆదరణ, భారీ పెట్టుబడులు, బలమైన ఆదాయ వనరులు ఈ ఘనతకు కారణమని హౌలిహాన్ లోకే నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న అభిమానుల సంఖ్య, మీడియా హక్కుల విలువ, ఫ్రాంచైజీలపై పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి ఐపీఎల్ వృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాయని విశ్లేషించింది.

ఆర్‌సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీ

హౌలిహాన్ లోకే విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం, ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా అవతరించింది. ఆర్‌సీబీ బ్రాండ్ విలువ 312 మిలియన్ డాలర్లకు చేరగా, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 245 మిలియన్ డాలర్లు, చెన్నై సూపర్ కింగ్స్ 244 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఈ నాలుగు ఫ్రాంచైజీలు ఐపీఎల్‌లో అత్యంత బలమైన బ్రాండ్‌లుగా గుర్తింపు పొందాయి.

ఇక మిగతా జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 168 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలవగా, రాజస్థాన్ రాయల్స్ 161 మిలియన్ డాలర్లు, గుజరాత్ టైటాన్స్ 158 మిలియన్ డాలర్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 157 మిలియన్ డాలర్లు, పంజాబ్ కింగ్స్ 156 మిలియన్ డాలర్లు, లక్నో సూపర్ జెయింట్స్ 122 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

హౌలిహాన్ లోకే అధ్యయనం ప్రకారం, వరుస విజయాలు, విశాలమైన అభిమాన వర్గం, భారీ స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, డిజిటల్ వేదికల్లో పెరుగుతున్న ప్రజాదరణ, బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాలు ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి అగ్రశ్రేణి జట్లు ఐపీఎల్ వాణిజ్య సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రపంచ క్రీడా మార్కెట్‌లో లీగ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయని నివేదిక పేర్కొంది.

పెట్టుబడిదారుల భారీ ఆసక్తి

ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్య మార్పులు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్ కన్సార్టియం 1.78 బిలియన్ డాలర్ల రికార్డు విలువకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా సుమారు 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలు ఐపీఎల్‌పై అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం ఎంత బలంగా ఉందో చాటుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్రాండ్ విలువలోనూ భారీ పెరుగుదల

ఐపీఎల్ స్వతంత్ర బ్రాండ్ విలువ కూడా గత ఏడాదితో పోలిస్తే 10.3 శాతం పెరిగి 4.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, మెర్చండైజింగ్, ఫ్రాంచైజీ పెట్టుబడులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అభిమానుల సంఖ్య ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నివేదిక వెల్లడించింది.

హౌలిహాన్ లోకే డైరెక్టర్ హర్ష్ తాలికోటి మాట్లాడుతూ, ఫ్రాంచైజీల విలువలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, ప్రైవేట్ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. క్రీడలు, మీడియా, వినియోగదారుల మార్కెట్ కలయికకు ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. బలమైన ఆదాయ వనరులు, వ్యయ నియంత్రణ, నిరంతరం విస్తరిస్తున్న అభిమానుల వర్గం కారణంగా రానున్న సంవత్సరాల్లో కూడా ఐపీఎల్ వృద్ధి కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.