నోష్ ల్యాబ్ ఫార్మా యాజమాన్యంపై చర్యలు ..
నోష్ ల్యాబ్ ఫార్మా యాజమాన్యంపై చర్యలు ..
బాధిత కుటుంబానికి రూ.1.5 కోట్ల పరిహారం..
కుటుంబానికి భరోసాగా నిలిచిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేష్
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పిట్టంపల్లిలోని న్యూస్‌ల్యాబ్ ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి భారీ పరిహారం అందేలా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కృషి చేశారు. శనివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాలకృష్ణ మృతహదేహాన్ని శనివారం ఉదయం సుమారు 8 గంటల 40 నిమిషాల సమయంలో ఆయన స్వగృహమైన చిన్నకాపర్తికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెంటనే అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి యాజమాన్యాన్ని కఠినంగా ప్రశ్నించారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రారంభంగా రూ.10 లక్షలకు మించి పరిహారం ఇవ్వలేమని యాజమాన్యం చెప్పగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అధికారులతో చర్చలు జరిపి, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఎమ్మెల్యే చివరకు బాధిత కుటుంబానికి రూ.1.5 కోట్ల పరిహారం ఇప్పించేలా చేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామిక సంస్థలు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చిట్యాల మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
