గొర్రెలుగా కాదు… సింహాలుగా జీవించండి

గొర్రెలుగా కాదు… సింహాలుగా జీవించండి

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గొర్రెలుగా కాదు.. సింహాలుగా జీవించండి అనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని కారుణ్య గ్రూప్స్ ఆఫ్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, సామాజికవేత్త తాళ్లపల్లి జయరాజ్ పిలుపునిచ్చారు. నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డివిజన్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గొర్రెలుగా కాదు.. సింహాలుగా జీవించండి అనే సందేశం కేవలం ఉపమానం మాత్రమే కాకుండా, సమాజాన్ని మేల్కొలిపే విప్లవాత్మక జీవన విధానం అని ఆయన పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు భయంతో జీవిస్తే, సింహం, పులి ధైర్యం, స్వతంత్రత, ఆత్మగౌరవానికి ప్రతీకలు అని వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయాన్ని వీడి ధైర్యంగా, స్వాభిమానంతో ముందుకు సాగాలని సూచించారు.

-యువత అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాలి:
కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక సమస్యలను నిర్మూలించాలంటే విద్య, సంఘటిత శక్తి, పోరాటం అనే మూడు ప్రధాన సూత్రాలు కీలకమని జయరాజ్ పేర్కొన్నారు. యువత ముందుకు వచ్చి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్యాయం ఎదురైన ప్పుడు మౌనం వహించడం హక్కులు కోల్పోవడానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అన్యాయం, వివక్షను ఎదుర్కొనేందుకు ప్రతి వ్యక్తిలో ఆత్మవిశ్వాసం, అవగాహన అవసరమని తెలిపారు.

చదువు మనకు జ్ఞానం మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా ఇస్తుందన్నారు. భయం మన హక్కులను కోల్పోయేలా చేస్తుందని, మౌనం అనేది అన్యాయానికి సహకారం అవుతుందని స్పష్టం చేశారు. స్వాభిమానం లేకుండా స్వేచ్ఛ సాధ్యం కాదని, ప్రతి వ్యక్తి తన విలువలను గౌరవించుకోవాలని సూచించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, మహిళలు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన అవగాహన కల్పించండి, ఆందోళన చేయండి, సంఘటితం అవ్వండి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి సమానత్వం, న్యాయం ఆధారంగా సమాజాన్ని నిర్మిద్దామని తాళ్లపల్లి జయరాజ్ పేర్కొన్నారు.