విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ అధికారులు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్టళ్లలో ఖాళీ సీట్లు లేకుండా 100 శాతం భర్తీ చేయాలని ఆదేశించారు. మౌలిక వసతుల పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అన్ని హాస్టళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల సౌకర్యాలు, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, మెరుగైన భోజనంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ అమలు, పరిశుభ్రత, క్షేత్రస్థాయి పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెడ్‌మాస్టర్లు, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.