బండి సంజయ్ పర్యటన అడ్డుకోవడంపై బీజేపీ ఆగ్రహం

కేసముద్రం, ఆంధ్రప్రభ : నర్సంపేటలో ఇటీవల మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామి కమని కేసముద్రం మండల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా కేసముద్రం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్, జనరల్ సెక్రటరీలు బోగోజు నాగేశ్వరాచారి, బొనగిరి ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి పర్యటనను పురస్కరిం చుకుని వరంగల్ జిల్లా బీజేపీ కార్యదర్శి రాణాప్రతాప్ రెడ్డితో పాటు ఇతర కీలక నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు.
ప్రజా సమస్యలపై పోరాడే గొంతుకలను నొక్కేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కుటుంబానికి జరిగిన తీరని లోటును పరామర్శించడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి పర్యటనలో అవాంతరాలు సృష్టించడం, నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని వారు పేర్కొన్నారు. అరెస్టు చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
