సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత‌ జగ్జీవ‌న్ రామ్‌

సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత‌ జగ్జీవ‌న్ రామ్‌

  • టీజీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ నిర్మ‌లజ‌గ్గారెడ్డి
  • యువత సమాజాభివృద్ధికి కృషి చేయాలి
  • సంగారెడ్డి క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య‌
  • ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : సమాజం లో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని కృషి చేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని టీజీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ నిర్మ‌లజ‌గ్గారెడ్డి అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని నటరాజ్ థియేటర్ సమీపంలో ఆదివారం జ‌గ్జీవ‌న్‌రామ్ జయంతి నిర్వ‌హించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ ఆర్‌.పాండు, ఆర్డీఓ గున్నాల రాజేంద‌ర్‌తో క‌లిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ చిన్నతనం నుంచే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, ఉన్నత ఆలోచనలు, కష్టపడి పనిచేయడం, నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని నిర్మ‌లజ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. యువత ఆయన చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నదని, అందుబాటులో ఉన్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత సమాజాభివృద్ధికి కృషి చేయాలి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో యువత సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బాబు జగ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు, యువత ముందుకు సాగాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించి జిల్లాలో అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కుల సంఘాల ప్రతినిధులకు సూచించారు. జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడు తెలిపారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడి, కేంద్ర మంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించార‌ని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ పని చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు ఆహూతులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ ఆర్‌.పాండు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి టి.అఖిలేష్ రెడ్డి, టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోపాజీ అనంత‌కిష‌న్‌, కూన సంతోష్‌, జార్జ్ మాథ్యూస్‌, అడ్వ‌కేట్ రామారావు వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.