ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆగ్రహం
ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆగ్రహం
కలెక్టరేట్ ఎదుట ధాన్యం రాశులతో రాస్తారోకో.. రైతులను చెదరగొట్టిన పోలీసులు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి దారుణంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
హవేలిఘనాపూర్ మండలంలోని బూరుగుపల్లి, గాజిరెడ్డిపల్లి, వాడి, కప్రాయిపల్లి, నాగారం తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపించారు. తరుగు పేరుతో 43, 44 కిలోల చొప్పున తీసుకుంటున్నారని, సంచికి రూ.15 నిర్వాహకులకు ఇస్తున్నప్పటికీ లారీలు సకాలంలో రావడం లేదని రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగకపోవడంతో రోజుల తరబడి కళ్లాల వద్దే ధాన్యం నిల్వ ఉండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలు కురిస్తే పండించిన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని నినాదాలు చేశారు. గతంలో వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి కూడా పరిహారం అందలేదని రైతులు ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయకపోతే తమకు మరింత ఇబ్బంది ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న మెదక్, హవేలిఘనాపూర్ ఎమ్మార్వోలు లక్ష్మణ్ బాబు, సింధు రేణుక, పట్టణ సీఐ మహేష్, సివిల్ సప్లై డీఎం జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అదనపు కలెక్టర్ నగేష్ ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు.
ఈ క్రమంలో ఓ రైతు తీవ్ర ఆవేదనతో ప్రమాదకర చర్యకు ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని రైతులను చెదరగొట్టి ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు.

