గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు…

గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు…

– ఆరుగురు అరెస్టు, భారీగా బంగారం స్వాధీనం

గూడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, గూడూరు మండలంలో గత సంవత్సరం కాలంగా ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి గుట్టు రట్టు చేశారు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, బందర్ ఇంచార్జ్ డీఎస్పీ కె. ధర్మేంద్ర ఆధ్వర్యంలో, పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

గూడూరు ఎస్సై చి. దివ్య ప్రకాష్, పెడన ఎస్సై బషీర్ నిషా, బందరు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ ఏఎస్ఐ జె. శ్రీనివాస్ మరియు సిబ్బంది సమన్వయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు గూడూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి 99.57 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి, మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువుల మొత్తం విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇళ్లల్లో వరుస దొంగతనాలకు తెరదించిన ఈ ఆపరేషన్‌తో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

Leave a Reply