రాధా – రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం…

రాధా – రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం…

  • రంగా అభిమానులతో చర్చించిన తరువాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం
  • అన్నయ్యతో ఎలాంటి విభేదాలు లేవు
  • కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు
  • వి.ఎం.రంగా కుమార్తె ఆశా కిరణ్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాధా – రంగా మిత్ర మండలిని పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశా కిరణ్ స్పష్టం చేశారు. కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా నిత్య అన్నదాన లంగర్ ఖానా ద్వారా స్థానిక సాయిబాబా మందిరం వద్ద గురువారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ పేదల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా అభిమానుల సంక్షేమమే ధ్యేయంగా ప్రయాణం చేస్తున్నానని చెప్పారు.

రంగా అభిమానుల ఆలోచన మేరకు తన రాజకీయరంగ ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రంగా అభిమానుల అన్ని పార్టీల్లో కులమతాలకు అతీతంగా ఉన్నారని చెప్పారు. వారి సంక్షేమం చూడాల్సిన బాధ్యత రంగా కుమార్తెగా తనపై ఉందన్నారు. అందువల్ల రాధా – రంగా మిత్ర మండలిని బలోపేతం చేస్తూ అభిమానులను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. రంగాకు రాధా, తాను రెండు కళ్లు లాంటి వారమని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన ప్రయాణానికి అన్నయ్య రాధా పూర్తి మద్దతు ఉందన్నారు.

కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడికి రావడం, ప్రజల ఆప్యాయత సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. దర్గా ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా పోరాడిన రంగా అభిమానులకు, పేదలకు సేవలందించాలని ముందుకొచ్చిన ఆశా కిరణ్ ను అభినందించారు. షా బుఖారి బాబా, షిర్డీ సాయిబాబా, ఏసుప్రభువు ఆశీస్సులతో ఆమె ఉన్నత పదవులు అధిరోహించి తండ్రికి తగ్గ తనయిగా పేదలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

తొలుత ఆశా కిరణ్ కు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. బీ కాలనీ వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయిబాబా మందిరంలో ఆశాకిరణ్ దంపతులను బాబా కండువా, చిత్రపటంతో ఆలయ ధర్మకర్త రాంబాబు సత్కరించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.