నిర్లక్ష్యమా?..కుట్రా?

నిర్లక్ష్యమా?..కుట్రా?
హుండీ లెక్కింపులో బంగారం, వజ్రాల గందరగోళం…
విచారణకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆదేశాలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో హుండీ లెక్కింపులో బంగారం, వజ్రాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్పందించారు. ఆంధ్రప్రభతో మాట్లాడుతూ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు. ఇటీవల హుండీ లెక్కింపులో సుమారు రూ.3.30 కోట్ల నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభించిందని తెలిపారు.
అయితే లెక్కింపు చివరి దశలో కొంత బంగారం “తుక్కు”గా పక్కకు వెళ్లిపోతుండగా ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించినట్లు వెల్లడించారు. సుమారు రూ.25 వేల విలువైన బంగారం, మరో లక్ష రూపాయల విలువైన ఆభరణాలను సభ్యులు స్వయంగా గుర్తించి తనకు చూపించినట్లు చెప్పారు. వీటిని గుర్తించకపోతే తుక్కులో కలిసిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు గతంలో కూడా నాలుగైదు సార్లు జరిగినట్లు అంగీకరించిన ఆయన, ఇది నిర్లక్ష్య ధోరణా లేక కావాలనే జరుగుతోందా అన్నదానిపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడతామని తెలిపారు.
సంబంధిత గోల్డ్ అప్రైజర్‌కు ఇప్పటికే మెమో జారీ చేసి వివరణ కోరినట్లు వెల్లడించారు. వజ్రాల నిర్వహణపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. బంగారం లెక్కింపులో ఆభరణాలను చితకకొట్టే సమయంలో వజ్రాలు విడిపోవడం సాధారణమని, అయితే వాటి సేకరణ, భద్రతలో స్పష్టమైన విధానం లేకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని వివరించారు. గతంలో కొన్ని వజ్రాలు అప్రైజర్ గదిలో లభించడంతో వాటిని లాకర్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. దేవస్థానంలో భారీ స్థాయిలో సిబ్బంది ఉండటంతో కొంతమంది తప్పిదాలకు పాల్పడే అవకాశం ఉందని, అయితే భక్తుల కానుకల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని చైర్మన్ స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ, అదనపు సీసీటీవీ వ్యవస్థ, ప్రత్యేక యంత్రాంగం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో పారదర్శకత కోసం బ్యాంక్ అధికారులు, అదనపు అప్రైజర్లు నియమించడం, ప్రతి చిన్న ఆభరణం కూడా కోల్పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని బొర్రా రాధాకృష్ణ హెచ్చరించారు.
