కల్తీ ఆహారంపై కఠిన తనిఖీలు చేపట్టాలి…

కల్తీ ఆహారంపై కఠిన తనిఖీలు చేపట్టాలి…

కలెక్టర్ డా. ఏ. సిరి.

కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలపై కఠినంగా తనిఖీలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆహార భద్రత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆహార భద్రత తనిఖీల అమలు కార్యాచరణపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, వీధి ఆహార వ్యాపార కేంద్రాలలో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

నిరంతర నిఘా ఉంటేనే కల్తీ రహిత జిల్లాగా కర్నూలును తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని అన్ని ఫుడ్ స్టాల్స్‌పై తనిఖీలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో తనిఖీలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆహార పదార్థాలలో అసలు–నకిలీ మధ్య తేడాలను ప్రజలకు అర్థమయ్యేలా పట్టిక రూపంలో సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.

విద్యార్థుల్లో అవగాహన పెంపు దిశగా డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక ప్రదర్శనలు (డెమోలు) నిర్వహించాలని, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ నెల నుంచి ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. రెస్టారెంట్లలో బిర్యానీలకు అనవసర రంగులు కలపడం, అమ్ముడవని ఆహారాన్ని మరుసటి రోజు మళ్లీ వేడి చేసి వినియోగించడం, వాడిన నూనెను పునర్వినియోగించడం వంటి చర్యలను కట్టడి చేయాలని కలెక్టర్ హెచ్చరించారు.

వీధి ఆహారంలో గోబీ వంటి పదార్థాలకు హానికర రంగులు, చైనీస్ సాల్ట్ వాడకాన్ని నిరోధించాలని ఆదేశించారు. ప్రజారోగ్యమే పరమావధిగా అధికారులు కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి రాజాగోపాల్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు.