ప్రవేట్ దుకాణదారుల తీరుపై అధికారుల ఆగ్రహం…

ప్రవేట్ దుకాణదారుల తీరుపై అధికారుల ఆగ్రహం…

భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే లీజు రద్దు
ఆలయ ఈవో వీకే శీనా నాయక్ హెచ్చరిక

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రవేట్ దుకాణాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం పై ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనికీ చేసారు. మహా మండపం 5వ అంతస్తులోని ప్రైవేట్ పూజా సామాగ్రి దుకాణాలపై పెద్ద స్థాయిలో వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. మహా మండపం 5వ అంతస్తులో పూజా సామాగ్రి విక్రయించే దుకాణదారులు తమకు కేటాయించిన నిర్ణీత స్థలాన్ని దాటి, భక్తులు నడిచే దారిని ఆక్రమిస్తున్నారని ఈవో గుర్తించారు.

దుకాణం వెలుపల సామాగ్రిని ప్రదర్శించడం వల్ల రద్దీ సమయంలో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఈవో గ్రహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్లోర్ లో ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా బయట పడటానికి కూడా అడ్డంగా దురాక్రమణ చేస్తున్నారని ఈవో ఆగ్రహించారు. పూజా సామాగ్రి, కొబ్బరికాయలను నిర్ణీత ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తున్నట్లు భక్తులు ఆర్ టి జి ఎస్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో, ఈవో స్వయంగా ధరల పట్టికలను పరిశీలించారు.

భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూల్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దుకాణదారునికి కేటాయించిన ప్రదేశం కంటే ఒక్క అడుగు ముందుకు వచ్చినా, వస్తువులను బయట ఉంచినా అది ఆక్రమణ కిందకే వస్తుంది. అటువంటి వారిపై భారీ జరిమానా విధించడమే కాకుండా, తక్షణమే లీజు రద్దు చేసి దుకాణాన్ని సీజ్ చేస్తాం” అని ఈవో హెచ్చరించారు. నిరంతరం దుకాణాల కదలికలను గమనించాలని, ఆక్రమణలు చేసే వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని లీజెస్ సెక్షన్ అధికారులను ఆదేశించారు.

ప్రతీ షాప్ దగ్గర మార్కింగ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ​ప్రతి దుకాణం వెలుపల వస్తువుల ధరల పట్టిక భక్తులకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని, ఆ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే లైసెన్సు రద్దు చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారపరంగా దుకాణదారులు గొడవలు పడుతూ ఒకరి మీద ఒకరు పై స్థాయిలో పిర్యాదులు చేయిస్తున్నారని, ఇవి ఆలయం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ​అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నదే మా ప్రధాన ఉద్దేశ్యం.

వ్యాపారాల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టే ఏ చర్యను దేవస్థానం ఉపేక్షించదు, అవసరమైతే నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన వారి లైసెన్స్ రద్దు చేసి, భవిష్యత్ లో ఇంద్రకీలాద్రి పై ఏ వ్యాపారంలో పాల్గొనకుండా నిషేధంకు దేవాదాయ కమిషనర్ వారికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి,లీజెస్ సెక్షన్ ఏఈవో రమేష్ బాబు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply