బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి…

  • బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
  • ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు జాబితా సవరణలో చురుకుగా పాల్గొనాలని పిలుపు
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ స్థాయి కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

నర్సంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ బీఎల్ఏలు, సభ్యత్వ నమోదు బూత్ ఇన్‌చార్జీల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం గణనీయమైన కృషి చేయలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులకే ప్రస్తుతం కొత్త పేర్లు పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని, నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని, ప్రజలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి చర్యలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియ అని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి మధ్యే ఉండాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి బూత్ ఏజెంట్ తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితా సవరణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. బూత్ ఏజెంట్ బాధ్యత అత్యంత కీలకమైందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గ్రామస్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సోషల్ మీడియా బలోపేతంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తల పాత్రపై బూత్ స్థాయి నాయకులకు సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, బీఎల్ఏలు, సభ్యత్వ నమోదు బూత్ ఇన్‌చార్జీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.