అత్యాధునిక సాంకేతికతతో పట్టాదారు పాసు పుస్తకాలు
అత్యాధునిక సాంకేతికతతో పట్టాదారు పాసు పుస్తకాలు
ఎన్నడూ లేని విధంగా సురక్షిత ఫీచర్లతో పంపిణీ
భూ యాజమాన్య వ్యవస్థలో సరికొత్త మైలురాయి..
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు
ఆంధ్రప్రభ ఏ కొండూరు : దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని.. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
శనివారం ఎ.కొండూరు మండలం, మాధవరంలో జరిగిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. 702 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భూమి అంటే కుటుంబానికి ఉద్వేగాలతో ముడిపడిన అంశమని..

ఈ నేపథ్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా.. శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. భద్రతా ఫీచర్లతో ఈ పుస్తకాలు రూపొందించినట్లు తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాసుపుస్తకాలు దోహదం చేస్తాయని.. హద్దులను మార్చేయడం వంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. అత్యంత కచ్చితత్వంతో మన భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా భూమికి సంబంధించిన వివరాలను కంప్యూటర్‌లో, మొబైల్‌లో చూసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

..అన్నదాతలు లక్షాధికారులు కావాలి..
రైతులు లాభదాయకమైన పంటలు సాగుచేసి.. వ్యవసాయంతో పాటు పాడికి ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్లాలని, అన్నదాతలు లక్షాధికారులు కావాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యానపంటలు సాగుదిశగా వెళ్తూ ప్రకృతి సేద్య విధానాలను అవలంబించాలన్నారు. ఎ.కొండూరు ప్రాంతాన్ని అగ్రీ, హార్టీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. నాలుగు మండలాల పరిధిలోని చాలా ప్రైవేటు భూములు 22ఏలో ఉన్నాయని.. ఈ భూములను 22ఏ నుంచి తొలగించి యజమానులకు భూహక్కులు కల్పించాలని కోరారు.
అన్ని వర్గాల్లోని పేదలకు వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. ప్రతి తండాలో సిమెంటు రోడ్లు ఉండేలా చేయడంలో తనవంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం అందిస్తున్న పట్టదారు పాసుపుస్తకాలు సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్నాయని.. యజమానులకు పూర్తిస్థాయిలో భూ భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. ఇంటింటికీ కృష్ణాజలాలు అందించే కార్యక్రమాన్ని ఎ.కొండూరులో ప్రాంతంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించేలా కృషిచేయనున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
కార్యక్రమంలో తిరువూరు ఆర్‌డీవో ఎ.కుమార్, తహసీల్దార్ ఎం.ఉదయ భాస్కర రావు, ఎంపీడీవో బొజ్జగాని శ్రీనివాసరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, డివిజనల్ విజిలెన్స్ కమిటీ సభ్యులు వాసు తదితరులు పాల్గొన్నారు.

