వైశ్య కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలి
- నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్
- బీఆర్ఎస్ హయాంలో వైశ్యులకు స్వర్ణయుగం: కోలేటి దామోదర్
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు వెంటనే రూ.200 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో నిర్వహించిన పెద్దపల్లి పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ.. వైశ్య కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. కార్పొరేషన్ ఏర్పడి రెండేళ్లు గడిచినా నిధులు విడుదల కాకపోవడం పట్ల రాష్ట్రంలోని ఆర్యవైశ్య సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించిన ఆయన, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి విశేష ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు దాదాపు 12 మంది మున్సిపల్ చైర్మన్లకు అవకాశం కల్పించారని, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవిని కూడా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు.
అంతేకాకుండా పలు దేవాలయాల చైర్మన్ పదవులు, మున్సిపల్ మార్కెట్ కమిటీల్లోనూ ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. అలాగే నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఉప్పల్ బగాయత్‌లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఆ కాలాన్ని ఆర్యవైశ్యులకు ‘స్వర్ణయుగం’గా అభివర్ణించారు.
నూతనంగా ఎన్నికైన పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులను అభినందించిన దామోదర్.. రాబోయే రెండేళ్లలో సంఘ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సంఘం తరఫున తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నూతన పట్టణ అధ్యక్షుడు ఓజ్జల సదానందం, మండల అధ్యక్షుడు కాసనగొట్టు విజయ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నలుమాచు ప్రభాకర్, అధ్యక్షుడు కోలేటి రమేష్, బల్లు చంద్రప్రకాశ్ గుప్తా, లింగమూర్తి, రాజేందర్, ఎన్నికల కన్వీనర్ కొమురవెల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
