Bejjanki | చెత్త బండి విస్మరించి బహిరంగంగా చెత్త దహనం

Bejjanki | బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి గ్రామంలో గ్రామపంచాయతీ తరపున చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా చెత్త బండి ఏర్పాటు చేసినప్పటికీ, కొంతమంది గ్రామస్తులు ఆ సేవను వినియోగించకుండా గుట్ట పరిసర ప్రాంతాల్లో చెత్తను వేస్తూ దహనం చేస్తున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర కాలుష్యం నెలకొంటోంది. గుట్ట ప్రాంతంలో చెత్తను కాల్చడం వల్ల ఎగిసే నల్ల పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఈ పొగ వల్ల సమీపంలో నివసించే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పర్యావరణానికి కూడా ఇది హానికరమని పేర్కొంటున్నారు.

గ్రామపంచాయతీ అధికారులు చెత్త బండి ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ నిర్వహిస్తున్నప్పటికీ, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సమస్య మరింత పెరుగుతోంది. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం, దహనం చేయడం చట్టవిరుద్ధమని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామ అభివృద్ధి మరియు పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ చెత్త బండి సేవలను వినియోగించాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుని, కాలుష్యాన్ని అరికట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply