Student | ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిపై దాడి

Student | ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిపై దాడి
- తోటలోకి తీసుకెళ్లి చితకబాదిన వైనం
Student | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులే దారుణంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. సదరు విద్యార్థిని కొంతమంది తోటి విద్యార్థులు మాటలతో నమ్మించి, కళాశాల సమీపంలో ఉన్న ఒక నిర్జన ప్రదేశంలోని తోటలోకి తీసుకెళ్లారు. తోటలోకి తీసుకెళ్లిన తర్వాత, అక్కడ గుంపుగా చేరిన విద్యార్థులు బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
కర్రలతో, చేతులతో చితకబాదినట్లు సమాచారం. ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పాత కక్షలా లేదా విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఇంతటి తీవ్ర రూపం దాల్చిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, దాడికి పాల్పడిన విద్యార్థులను గుర్తించే పనిలో ఉన్నారు.
విద్యాసంస్థల యాజమాన్యం కూడా దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే పోలీసుల పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులు ఎవరు? అసలు గొడవకు కారణం ఏమిటి? అనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
