అర్ధరాత్రి మృత్యుఘోష..
అర్ధరాత్రి మృత్యుఘోష..
లారీ–బస్సు ఢీకొని చిన్నారి, విద్యార్థిని దుర్మరణం
ఉడుమువారిపల్లి వద్ద ఘోర ప్రమాదం.. 16 మందికి తీవ్ర గాయాలు
నిద్రలో ఉన్న ప్రయాణికులను కబళించిన మృత్యుదేవత..
తిరుపతి, ఆంధ్రప్రభ: అర్ధరాత్రి వేళ కడప–తిరుపతి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉడుమువారిపల్లి సమీపంలో కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు ఎక్కువ మంది గాఢనిద్రలో ఉండటంతో ఒక్కసారిగా భారీ శబ్దం, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.
ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రయాణికులు సీట్లలోనే ఇరుక్కుపోగా, పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనాస్థలం రక్తసిక్తంగా మారింది. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.
తల్లి ఒడిలోనే చిన్నారి మృతి
ఈ ప్రమాదంలో రాజంపేటకు చెందిన తొమ్మిది నెలల పునీత్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న చిన్నారి ఒక్కసారిగా మృత్యువాత పడటం హృదయ విదారకంగా మారింది. బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఘటనాస్థలిలో విషాద వాతావరణం నెలకొంది.
మార్గమధ్యంలోనే కన్నుమూసిన విద్యార్థిని
శ్రీకాళహస్తికి చెందిన యశ్విత (16) ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను అత్యవసర చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. చదువులో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న విద్యార్థిని అకాల మరణం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
16 మందికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చేతులు, కాళ్లు విరిగిన వారు, తలకు గాయాలైన వారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 108 అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మంత్రి స్పందన
ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చగా, ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
