3rdAprilchintana | గుడ్ ఫ్రైడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..

3rdAprilchintana | గుడ్ ఫ్రైడే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
3rdAprilchintana |యూద మత చరిత్ర మరియు యేసు క్రీస్తు అవతరణ
యేసు బోధనలు మరియు మానవతా సందేశం
శిలువ మరణం మరియు త్యాగ గాథ
గుడ్ ఫ్రైడే ఆచారాలు మరియు లెంట్ ఉపవాసం
ఈస్టర్ పునరుత్థానం మరియు విశ్వాసం
మానవాళికి గుడ్ ఫ్రైడే ఇచ్చే సందేశం
త్యాగానికి చిహ్నం గుడ్ ఫ్రైడే
3rdAprilchintana |మానవాళి పాప విమోచన కోసం, లోక క్షేమం కోసం తన ప్రాణాన్నే అర్పించిన ప్రేమ స్వరూపుడు, దైవ కుమారుడు యేసు క్రీస్తు శిలువ మరణాన్ని స్మరించుకునే అత్యంత పవిత్ర దినమే ‘గుడ్ ఫ్రైడే’. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో, మౌన ప్రార్థనలతో ఆచరించే ఈ రోజు కేవలం విషాదాన్ని సూచించేది మాత్రమే కాదు; అపారమైన త్యాగం, క్షమ, నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం కల్వరిగిరి పై జరిగిన ఆ రక్తసాక్షి ఘట్టం, నేడు ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఎదిగిన క్రైస్తవ ధర్మానికి మూలస్తంభంగా నిలిచింది.
ప్రాచీన మత చరిత్రను పరిశీలిస్తే, యూద మతం క్రీపూ.2000 సంవత్సరాల నాటికే రూపుదిద్దుకుంది. అదే కాలంలో భారతదేశంలో వేద సంస్కృతి విస్తరించి ఉంది. యూదుల పవిత్ర గ్రంథమైన పాత నిబంధనలోని ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ గ్రంథాలు వారి ధర్మశాస్త్రానికి మూలాధారాలు. అయితే.. కాలక్రమేణా ఆచార వ్యవస్థలు సంక్లిష్టమై, ఆత్మీయత కంటే బాహ్యాచారాలకు ప్రాధాన్యం పెరిగింది. సామాజిక అసమానతలు, పేదల పై నిర్లక్ష్యం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష, దేవుని పేరిట యాగబలులు వంటి ఆచారాలు విస్తరించాయి. ఆధ్యాత్మిక సారాంశం క్షీణించిన ఈ కాలంలోనే ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చుతూ కన్య మరియ గర్భంలో జన్మించిన యేసు క్రీస్తు మానవ చరిత్రలో ఒక నూతన దశను ఆరంభించారు.
యేసు బాల్యం నుంచే ఆధ్యాత్మిక దృక్పథంతో పెరిగి, సమాజంలోని అణగారిన వర్గాలకు ఆదరణగా నిలిచారు. పాపులుగా ముద్రపడిన వారిని సమాజంలో తిరిగి స్థాపించేందుకు కృషి చేశారు. ”పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు” అనే ఆయన బోధనలో మానవతా దృక్పథం ప్రతిబింబిస్తుంది. కఠినమైన ధర్మశాస్త్రాలను ప్రేమ, క్షమ, కరుణ అనే మానవీయ విలువలతో సరళీకరించి కొత్త నిబంధనగా బోధించారు. ఆయన ఉపదేశాలు సామాన్య ప్రజలను ఆకర్షించగా, అప్పటి మతాధికారులు, రాజకీయ పాలకులకు అవి సవాలుగా మారాయి. ముఖ్యంగా రోమనుల పాలనలో ఉన్న యూదేయాలో ఆయన ప్రభావం పెరుగుతుండటంతో, ఆయన పై కుట్రలు పన్నబడ్డాయి.
చివరకు క్రీశ 30-33 ప్రాంతంలో ఒక శుక్రవారం రోజున యేసును అరెస్టు చేసి, విచారణ పేరుతో అవమానించి, దైవద్రోహిగా ముద్రవేసి శిలువ వేయించారు. ఈ ఘటనకు రోమనుల పాలకుడు పొంతియుస్ పైలేట్ అధికారిక అనుమతి ఇచ్చినట్లు సువార్తలు పేర్కొంటాయి. కల్వరి లేదా గోల్గొథా అనే ప్రదేశంలో ఆయనకు ముళ్ల కిరీటం పెట్టి, కొరడాలతో హింసించి, చేతులు-కాళ్లకు మేకులు పొడిచి శిలువపై నిలబెట్టారు. మానవునిగా తీవ్రమైన శారీరక వేదనను అనుభవిస్తున్నప్పటికీ, ”తండ్రీ, వీరిని క్షమించు; వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు” అని ప్రార్థించడం ఆయన దైవత్వాన్ని చాటిచెప్పింది. శత్రువులను క్షమించడం అనే అత్యున్నత నైతిక విలువను ప్రపంచానికి ఆయన ఆచరణలో చూపించారు.
శిలువపై మరణం సాధారణంగా అపమానకరమైన శిక్షగా భావించబడేది. అయినప్పటికీ.. ఆ మరణాన్ని ‘గుడ్ ఫ్రైడే’గా ఎందుకు పిలుస్తారన్న ప్రశ్నకు లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మానవాళి చేసిన పాపాలకు పరిహారంగా దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించి, విమోచన మార్గాన్ని తెరిచాడనే విశ్వాసం క్రైస్తవ సిద్ధాంతానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ‘గుడ్‘ అనే పదం ఇక్కడ శుభప్రదం, మంగళకరం అనే భావాన్ని సూచిస్తుంది. మరణం ద్వారానే జీవం, బాధ ద్వారానే విమోచనం సాధ్యమని ఈ రోజు సూచిస్తుంది. కొన్ని సంప్రదాయాల్లో దీనిని హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. గుడ్ ఫ్రైడేకు ముందు నలభై రోజుల పాటు క్రైస్తవులు లెంట్ అనే ఉపవాస కాలాన్ని ఆచరిస్తారు. ఇది ఆత్మ పరిశీలన, పశ్చాత్తాపం, ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక.
గుడ్ ఫ్రైడే రోజున చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు యేసు శిలువ పై గడిపిన సమయంగా భావించి, మౌన ప్రార్థనలు నిర్వహిస్తారు. ‘ఏడు మాటలు‘ అనే ధ్యాన ప్రసంగాలు వినిపిస్తారు. ఈ రోజు వివాహాలు, వేడుకలు వంటి శుభకార్యాలు నివారించబడతాయి. ఉపవాసం ఉంటారు. ఈ ఆచారాలన్నీ ఆత్మపరిశీలనను మేల్కొల్పడమే లక్ష్యం.
యేసు మరణంతో కథ ముగియలేదు. బైబిల్ ప్రకారం, ఆయన మూడవ రోజు తిరిగి లేచారు. దీనినే ఈస్టర్ ఆదివారంగా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి ప్రాణాధారం. మరణం పై జీవం గెలిచింది అనే సంకేతం ఇది. యేసు బోధించిన ప్రేమ, శాంతి, సేవా తత్త్వాలు ప్రపంచ మానవీయ విలువల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. ఆయన బోధించిన ”నీ పొరుగువానిని నీవలె ప్రేమించు” అనే సందేశం కాలాతీతమైనది.
త్యాగం ద్వారానే మహత్తరమైన మార్పులు సాధ్యమవుతాయి. ప్రేమ ద్వారానే మానవ హృదయాలను గెలుచుకోవచ్చు. యేసు క్రీస్తు చూపిన మార్గం సమస్త మానవాళికి మార్గదర్శకం. ఈ పవిత్ర దినాన ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ, మన జీవితాలలో కరుణ, క్షమ, సేవా భావాలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించవచ్చు.
- రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494
