Revanth Reddy | రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు..
117 సీట్ల లక్ష్యంతో కాంగ్రెస్..
Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సీఎం తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయనని మాత్రమే చెప్పానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎక్కడా చెప్పలేదన్నారు. భవిష్యత్తులో సంగారెడ్డి స్థానం మహిళలకు కేటాయించినా లేదా జనరల్ స్థానంగానే ఉన్నా అక్కడి నుంచి నిర్మలనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని వెల్లడించారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఎమ్మెల్యేలంతా అప్రమత్తమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కాని ప్రజాప్రతినిధులను సీఎం హెచ్చరిస్తున్నారని తెలిపారు. గతంలో కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతికూల సర్వేలు వచ్చాయని గుర్తు చేశారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వత విజేతలు కారని, తామే గొప్ప అనుకుంటే ప్రజలు అంగీకరించరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో 117 స్థానాల్లో విజయం సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు. సీఎం హెచ్చరించిన తర్వాత కూడా తీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
సర్వేలు ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని, వాటిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించడం రాజకీయాల్లో సహజమేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
