బడి వైపు అడుగు.. ప్రగతి వైపు పరుగు..
బడి వైపు అడుగు.. ప్రగతి వైపు పరుగు..
జిల్లాలో ఉత్సాహంగా బడి పిలుస్తోంది కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విలువల విద్య
సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి*l
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వత్సవాయి, ఆంధ్రప్రభ : జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ఉత్సాహవంతంగా కొనసాగుతోందని.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కృషిచేస్తున్నారని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఈవో ఎల్.చంద్రకళ, సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట గ్రామాల్లో పర్యటించారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరంలో ఇంటింటి అవగాహన కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరిన 26 మంది చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మక్కపేటలోని జెడ్‌పీ ఉన్నతపాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రవేశాల తీరుతెన్నులను పరిశీలించారు. బడి బయట ఉన్న పిల్లలను సైతం గుర్తించి పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి చిన్నారి పాఠశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించేలా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని, ప్రతి బాలబాలిక తప్పనిసరిగా బడిలో చేరేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రాప్‌అవుట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించే దిశగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన బడి మన భవిష్యత్తు కింద జరుగుతున్న పనులను పాఠశాలలు ప్రారంభమయ్యేసరికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
