Dhoni Birthday | నందిగామలో ధోనీ క్రేజ్..

77 అడుగుల భారీ కటౌట్, నెట్టింట వైరల్!

Dhoni Birthday | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన ఫ్యాన్స్ సరికొత్త రికార్డు సృష్టించారు. ధోనీ పుట్టినరోజు (జూలై 7) పురస్కరించుకుని నందిగామ శివారులోని అంబారుపేట వద్ద ఏకంగా 77 అడుగుల భారీ కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ – విజయవాడ హైవేపై సందడి..
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి పక్కనే ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడంతో, హైవేపై వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు దీనిని చూసేందుకు ఎగబడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్జెర్సీ ధరించి ఉన్న ధోనీ భారీ కటౌట్ ప్రస్తుతం జాతీయ రహదారిపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఐపీఎల్‌లోనూ, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ధోనీ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ చెన్నై ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులు ఈ కటౌట్ చూసి తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ధోనీపై ఉన్న వీరాభిమానంతో నందిగామకు చెందిన అభిమానులు గత కొన్నేళ్లుగా ఆయన పుట్టినరోజున ఇలాంటి భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 77 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ కటౌట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.