బీసీ రిజర్వేషన్లకు శాస్త్రీయ ప్రాతిపదికే లక్ష్యం…

బీసీ రిజర్వేషన్లకు శాస్త్రీయ ప్రాతిపదికే లక్ష్యం…
స్థానిక సంస్థల ఎన్నికల ముందు డెడికేటెడ్ కమిషన్ కసరత్తు
“99 శాతం సర్వే కాదు.. 99 శాతం ఖచ్చితత్వం ముఖ్యం”
కర్నూలులో వినతులు స్వీకరించిన కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని రాజ్యాంగబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ విస్తృత స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ప్రతి ఎన్నికల యూనిట్‌లో బీసీల జనాభా, సామాజిక వెనుకబాటు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషిస్తూ కమిషన్ జిల్లాల పర్యటన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశం మొత్తం బీసీ రిజర్వేషన్ల భవిష్యత్ రూపురేఖలపై కీలక చర్చలకు వేదికగా మారింది.
రిజర్వేషన్ల నిర్ణయంలో ‘ట్రిపుల్ టెస్ట్’కు ప్రాధాన్యం

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయం కేవలం రాజకీయ ప్రక్రియ కాదని, అది రాజ్యాంగపరమైన బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన “ట్రిపుల్ టెస్ట్” ప్రమాణాల ప్రకారం బీసీల జనాభా, వారి సామాజిక వెనుకబాటు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వంటి అంశాలపై శాస్త్రీయ అధ్యయనం తప్పనిసరని చైర్మన్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై కమిషన్ ప్రత్యేక సిఫారసులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం జిల్లాల నుంచి సేకరిస్తున్న గణాంకాలు అత్యంత కీలకమన్నారు.

“సర్వే పూర్తయిందనే కాదు.. ఖచ్చితత్వం కూడా అవసరం”
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, గత కుల గణన వివరాలను కమిషన్ సమగ్రంగా పరిశీలిస్తోందని చైర్మన్ తెలిపారు. సర్వే 99 శాతం పూర్తయిందని చెప్పడం మాత్రమే సరిపోదని, అందులోని డేటా 99 శాతం ఖచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేశారు. అదే డేటాను కమిషన్ భవిష్యత్ రిజర్వేషన్ నిర్ణయాలకు ఆధారంగా ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సర్వేలో పొరపాట్లు ఉంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని సూచించారు. అందుకే జనాభా వివరాలు, ఓటర్ల నిష్పత్తి, బీసీ వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఎన్నికలు – ఆర్థిక సంఘం నిధుల అనుబంధం
స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి నిర్వహించాల్సిన అవసరాన్ని కూడా కమిషన్ ప్రస్తావించింది. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదలకు ఎన్నికలు నిర్వహించడం కీలక ప్రమాణమని చైర్మన్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక సిద్ధమైన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని తెలిపారు..
కేవలం జనాభా కాదు… వెనుకబాటుతనంపై కూడా అధ్యయనం
బీసీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై గుణాత్మక నివేదికలు కూడా అవసరమని కమిషన్ అభిప్రాయపడింది. ముఖ్యంగా విద్యార్థుల డ్రాపౌట్స్, విద్యా స్థాయి, ప్రభుత్వ పథకాల లబ్ధి, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఇది కేవలం రిజర్వేషన్ శాతం నిర్ణయించే ప్రక్రియ మాత్రమే కాకుండా, బీసీల వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే అధ్యయనంగా మారుతోందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
కర్నూలు జిల్లాలో బీసీల ప్రాతినిధ్యం గణనీయమే
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి కమిషన్‌కు జిల్లాకు సంబంధించిన సమగ్ర గణాంకాలను వివరించారు. జిల్లాలో బీసీ వర్గాల జనాభా సుమారు 50 నుంచి 60 శాతం మధ్య ఉందని తెలిపారు. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, మేయర్, చైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు కలిపి మొత్తం 657 మంది బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు వెల్లడించారు. వాల్మీకి బోయ, కురుబ, యాదవ, గౌడ, రజక, వడ్డే, దూదేకుల, ముస్లిం షేక్ తదితర వర్గాలు జిల్లాలో అధికంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శాతం 59.89 కాగా, బీసీల అక్షరాస్యత 64.98 శాతంగా నమోదైందన్నారు.
ప్రజలతో ప్రత్యక్ష సంప్రదింపులే ప్రత్యేకత
ఈ సమావేశంలో వివిధ కుల సంఘాలు తమ సమస్యలు, డిమాండ్లు, ప్రాతినిధ్య అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చాయి. ప్రజలతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడమే కమిషన్ ప్రధాన ఉద్దేశమని చైర్మన్ పేర్కొన్నారు. సమావేశంలో డెడికేటెడ్ కమిషన్ సెక్రటరీ రాజు, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, జడ్పీ సీఈఓ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, బీసీ సంక్షేమ అధికారులు, వివిధ కార్పొరేషన్ ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
