Indrakeeladri | వైభవంగా ఆషాడసారె ఉత్సవాలు..
తరలివస్తున్న భక్త బృందాలు..
భక్తుల రద్దీకి తగ్గట్టే విస్తరిస్తున్న దుర్గగుడి సేవలు
ఆషాఢ సారె ఉత్సవాల్లో 17వ రోజు మహిళా భక్తుల వెల్లువ
ఒక్కరోజే 35,909 మంది దర్శనం..
39 సారె బృందాల నుంచి 16,976 మంది సారె సమర్పణ
Indrakeeladri | ( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ సారె మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు వేలాది మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తుండగా, మరోవైపు భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, పూజా సేవలు అందించేందుకు దేవస్థానం మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. అదే సమయంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆలయ సిబ్బందికి కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు..
భక్తుల రద్దీ సమయంలో పూజా సేవలకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్, కొత్త ర్యాంప్ నిర్మించనున్నట్లు ఈవో వెల్లడించారు. లక్ష్మీ గణపతి ఆలయం నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మీదుగా నేరుగా పూజా మండపాలకు చేరుకునే ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బయటకు వెళ్లే మార్గాన్ని విస్తరించి రాకపోకలను మరింత సులభతరం చేయాలని సూచించారు. ఈ ఏర్పాట్లతో ప్రత్యేక పూజలు, అర్చనలు, సేవల్లో పాల్గొనే భక్తులు వేగంగా పూజా మండపాలకు చేరుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఈఓ ఆకస్మిక తనిఖీలు..
ఇదే సందర్భంగా ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఈవో భద్రతా సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్ల ప్రవేశాన్ని వందశాతం అడ్డుకోవాలని, భక్తులతో మర్యాదగా, వినయపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి భక్తిని “జై భవాని” అంటూ ఆహ్వానించి, భక్తి భావాన్ని ప్రతిబింబించేలా సేవలు అందించాలని సూచించారు.
17వ రోజు ఆషాడ సారె మహోత్సవాలు..
ఆషాఢ సారె మహోత్సవాల్లో 17వ రోజు మహిళా భక్తుల రద్దీ విశేషంగా కనిపించింది. అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో మహిళలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు 39 సారె బృందాలు ఆలయానికి చేరుకోగా, మొత్తం 16,976 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారె బృందాలకు దేవస్థానం ఉచిత దర్శనం, ఆశీర్వచనంతో ప్రత్యేక ఏర్పాట్లు కల్పించింది.

గురువారం వివరాలు..
గురువారం ఆలయానికి మొత్తం 35,909 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 4,652 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. 54,527 ప్రసాదాల యూనిట్లు విక్రయించగా, విరాళాల రూపంలో రూ.4,91,935 లభించింది. 276 మంది వివిధ సేవల్లో పాల్గొనగా, 1,001 మంది తలనీలాలు సమర్పించారు. అన్నదానాన్ని 9,210 మంది భక్తులు స్వీకరించినట్లు దేవస్థానం గణాంకాలు వెల్లడించాయి. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నారు.
