జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో…
జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో…
200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారు….!
డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలే సాక్ష్యం….!
సంచలన వ్యాఖ్యలు చేసిన “కన్నా”.
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో…200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలే సాక్ష్యం… అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జగన్ రెడ్డి పాలనపై ఘాటు విమర్శలు చేశారు. జగన్ రెడ్డి రౌడీ మూకలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నాయి… నా ఎస్సీలు, నా ఎస్టీలు, అంటూ నమ్మించి గొంతుకోస్తున్న జగన్ రెడ్డి దళితుల గొంతు కోస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరించింది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 8,211 మాత్రమే దాడులు జరిగితే, వైసీపీ ఐదేళ్ల పాలనలో 56,981 జరిగాయి. 2014-19తో పోల్చితే, వైసీపీ హయాంలో దళితులపై 10 రెట్లు దాడులు పెరిగాయి. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.27,000కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.5,000 కోట్లు మొత్తం రూ.33వేల కోట్లను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారు. దీంతో లక్షలాదిమంది దళిత సోదరులు కోట్లాది రూపాయల బ్యాంకు సబ్సిడీ లోన్లు కోల్పోయారు.
జగన్ రెడ్డికి అధికార మదం ఇంకా పోలేదు….!
జగన్ రెడ్డికి ఇంకా అధికార మదం పోలేదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి శిక్షించినా జగన్ తీరు మార్చుకోలేదు. అన్నమయ్య జిల్లాలో జగన్ సైకో మూకలు, ఓ దళిత అధికారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు 20 మందితో వచ్చి ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేయడం దారుణమన్నారు. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని ఎంపీడీవో జవహర్ బాబును అడిగారు.
మండలాధ్యక్షురాలు వస్తేనే తాళాలు ఇస్తామని ఎంపీడీవో చెప్పడంతో “మాకే ఎదురు చెబుతావా” అంటూ దాడి చేశారు. కుర్చీలో నుంచి కిందపడిపోయినా తన్నుతూ పిడిగుద్దులతో దాడి చేశారు. అడొచ్చిన అటెండర్, కార్ డ్రైవర్ ను కూడా దాడి చేసి ఎంపీపీ గది తాళాలు పగగొట్టారు. ఇలాంటి జగన్ రెడ్డికి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడిన జగన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు.
దళితులపై పెరిగిన దాడులు:-
జగన్ రెడ్డి తన హయాంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన నిందితుడు అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోలేదు. నేరస్తుడిగా అభియోగాలు మోపుతున్న నిందితుడ్ని జగన్ రెడ్డి వెంటేసుకుని తిరుగుతున్నాడు. తాడిపత్రిలో దళిత సిఐని కులం పేరుతో దూషించి అద్దె ఇంట్లో బలవన్మరణానికి పాల్పడేలా చేశారు. కోడికత్తి డ్రామాతో దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాస్ ని ఐదేళ్లుగా జైలులో మగ్గబెట్టి తల్లిదండ్రులను కష్టాలు పాలేశారు. ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లాలో కులచిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి భారీ కుట్రకు పాల్పడ్డాడు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి, దాన్ని వివాదంగా మలిచి, కులాల మధ్య కుంపటి రాజేసేందుకు విఫలయత్నం చేశాడు. కరోనా సమయంలో మాస్కులు అడిగినందుకు గౌరవ ప్రధమైన వృత్తిలో ఉన్న దళిత డాక్టర్ సుధాకర్ ను నడి రోడ్డు మీద బట్టలు లేకుండా నిల్చోబెట్టి పోలీసులతో లాఠీలతో కొట్టించి, సైకో ముద్ర వేసి మానసిక వైద్యశాలలో వేశారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఓం ప్రతాప్ మదనపల్లెలో ఓ మద్యం దుకాణం వద్ద నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలతో విక్రయిస్తున్నారని జగన్ ను దూషించిన వీడియో వైరల్ అయిన మరుసటి రోజు అనుమానస్పదంగా మరణించాడు. వరప్రసాద్ అనే వ్యక్తి అక్రమ ఇసుక దందాను ప్రశ్నించినందుకు శిరోముండనం చేసి అవమానించారు. డా. అచ్చెన్న కడప పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్… కులం పేరుతో వేధించి హత మార్చారు.
దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు…!
దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని ఏన్.సీ.ఆర్.బీ రిపోర్టు స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన దళిత యువతి అనూష పై అత్యాచారం చేసి హత్య చేశారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం, హత్య జరిగితే కనీసం పరామర్శకు కూడా వెళ్లలేదు. పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ దళిత నాయకులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన జాతీయ స్థాయి జూనియర్ క్రీడాకారిణి అయిన స్నేహలత అనే దళిత యువతిపై వైసీపీ గూండాలు అత్యాచారం, హత్య చేశారు. డాక్టర్ అనితా రాణి అనే మహిళ డాక్టర్ ను వైకాపా నేతలు నిర్బంధించి, వేధించి, అసభ్యపదజాలంతో దూషించారు.రాజమండ్రిలో 10 వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుంటూరు రమ్య (ఆగష్టు 15, 2021) గుంటూరు జిల్లా, పెదకాకానికి చెందిన బీ.టెక్ చదువుతున్న దళిత విద్యార్థిని దారుణ హత్య. జగన్ నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ ముఠానాయకుడు వెంకటరెడ్డి ని ఇప్పటికీ అరెస్టు చేయలేదు.
దళితులంటే జగన్ రెడ్డికి ప్రేమే లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ రెడ్డికి దళితుల యోగ క్షేమాలు గుర్తుకు వస్తాయి. ఓట్లు కోసం దళితులు కావాలి, పక్కన కూర్చోడానికి మాత్రం దళితులు వద్దు. దళితుల ఓట్లతో రాజకీయ పీఠమెక్కాలి. వాళ్ల ధన, మాన, ప్రాణాలకు మాత్రం రక్షణ కరువు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి దళితులపై చూపించిన కపట ప్రేమ ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు.
