అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి ..

అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి ..
నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావన..
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై కీలకంగా జరిగాయని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల కోసం రూపొందించిన నిజమైన బడ్జెట్ అని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం ఆనందకరమని అన్నారు.
దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతులు, యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రధానంగా సింగ్‌నగర్ ఫ్లైఓవర్ సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆ సమయంలో సుమారు 50 వేల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించబడిందని తెలిపారు.
అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నందున ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సింగ్‌నగర్ ఫ్లైఓవర్ కింద రైల్వే అండర్‌పాస్ నిర్మాణం చేయించామని, దాంతో కొంతవరకు ట్రాఫిక్ సమస్య తగ్గిందని తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కావడానికి రోడ్డు విస్తరణతో పాటు అదనపు ట్రాఫిక్ సదుపాయాలు అవసరమని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ పక్కనే రెండో ఫ్లైఓవర్ నిర్మించాలనే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించామని, దీనిపై సభ కూడా సానుకూలంగా స్పందించినట్లు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని కలిసి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరగా, దానికి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి అదనపు నిధులు కేటాయించి హాస్టల్, ఇతర సదుపాయాల కోసం సహాయం చేయాలని కోరినట్లు చెప్పారు.
అలాగే నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలను అసెంబ్లీలో సమర్థవంతంగా ప్రస్తావించినట్లు తెలిపారు, ప్రత్యేకంగా ఆటో కార్మికుల సమస్యను కూడా సభ దృష్టికి తీసుకెళ్లామని, గత ప్రభుత్వ కాలంలో విధించిన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని కోరగా మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, సుల్తాన తదితరులు పాల్గొన్నారు.
