నిహాల్ రాజ్ కుమార్ వీరవిహారం..

నిహాల్ రాజ్ కుమార్ వీరవిహారం..
- రాయనపాడు జట్టుకు ఘన విజయం
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలో నిర్వహించిన టీ-20 టోర్నమెంట్ మ్యాచ్‌లో రాయనపాడు వేగన్ వర్క్‌షాప్ రైల్వే క్రికెట్ అకాడమీ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. విజయవాడ రైల్వే లిటిల్ ఛాంపియన్స్ క్రికెట్ అకాడమీతో జరిగిన పోటీలో రాయనపాడు జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జట్టు విజయంలో నిహాల్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు.
అతడు 60 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్సర్ బాదుతూ 145 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బ్యాటర్ అవార్డులు అందుకున్నాడు. అలాగే జట్టు కెప్టెన్ నిఖిలేష్ అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
నిహాల్ రాజ్ కుమార్ – నిఖిలేష్ జోడీ రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. లక్ష్య ఛేదనలో విజయవాడ రైల్వే లిటిల్ ఛాంపియన్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. దీంతో రాయనపాడు వేగన్ వర్క్‌షాప్ రైల్వే క్రికెట్ అకాడమీ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆటగాళ్ల ప్రతిభపై కోచ్‌లు, నిర్వాహకులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
