త్వరలో అందుబాటులోకి గన్నవరం నూతన టెర్మినల్

  • విజయదశమీ నాటికి నిర్మాణాలు పూర్తి..
  • విమానాశ్రయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ కేశినేని చిన్ని

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న నూతన టెర్మినల్ నిర్మాణం, మౌలిక వసతుల విస్తరణ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన వారు, విజయదశమి నాటికి నూతన టెర్మినల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విమానాశ్రయ విస్తరణతో విజయవాడతో పాటు మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊతం లభిస్తుందన్నారు. ఆగస్టు 13 నుంచి విజయవాడ–వారణాసి మీదుగా కలకత్తాకు నూతన విమాన సర్వీసు ప్రారంభం కానుండటాన్ని స్వాగతిస్తూ.. దీనివల్ల ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన సహాయ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు ఎంపీ కేశినేని చిన్ని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.