కేసముద్రంలో 15 రోజుల వేసవి శిక్షణ శిబిరం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేసముద్రం స్టేషన్‌లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బందెల రాజు తెలిపారు.
ఈ శిబిరంలో మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, ముందుగా నమోదు చేసుకున్న 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు.
విద్యార్థులకు స్నాక్స్, నోటుబుక్స్, అవసరమైన స్టేషనరీ సామగ్రి ఉచితంగా అందించబడుతాయని చెప్పారు. ఈ శిబిరంలో కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం, కథలు చెప్పడం, ఇండోర్–ఔట్‌డోర్ గేమ్స్, గణిత మోడలింగ్, సైన్స్ ప్రయోగాలు, టీఎల్‌ఎం తయారీ, సంగీతం, నృత్యం, మాక్ పార్లమెంట్ వంటి పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక సమ్మతి పత్రంతో రావాలని సూచించారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు కోరారు.
