విద్యార్థులే మంత్రులు… విద్యార్థులే ప్రతిపక్షం…

ఈ స్కూల్ కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

13 ఏళ్ల వయసులోనే ఒక పాఠశాలను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా మార్చిన విద్యార్థిని

కేవలం 13 ఏళ్ల వయసులోనే ‘టీచ్ ఫర్ ఇండియా’ విద్యార్థిని సఫూరా సిద్దిఖా(Safoora Siddiqua), తరగతిలో నేర్చుకున్న విద్యను పాఠశాల అంతటా ఒక గొప్ప ప్రజాస్వామ్య ఉద్యమంగా మలిచింది. ప్రస్తుతం బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) చివరి సంవత్సరం చదువుతున్న ఆమె, విద్యార్థుల నేతృత్వంలో నడిచే మాక్ పార్లమెంట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆమె ఈ ఆలోచన, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పాఠశాలలో ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ ఆలోచన ఒక్కసారిగా వచ్చిందేమీ కాదు. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే సఫూరా, బడి వాతావరణంలో ఉన్న అనేక వ్యత్యాసాలను నిశితంగా గమనించడం ప్రారంభించింది. పారిశుద్ధ్య లోపాల నుంచి మొదలుకొని చదువుల్లో ఉన్న వెనుకబాటుతనం వరకు ఎన్నో అంశాలు ఆమె దృష్టికి వచ్చాయి. సాధారణ స్టూడెంట్ క్లబ్ ద్వారా వీటిని కొంతవరకు పరిష్కరించవచ్చని భావించినప్పటికీ, దానివల్ల లోతైన మార్పు గానీ, జవాబుదారీతనం గానీ, సుదీర్ఘ ప్రభావం గానీ ఉండవని ఆమె గ్రహించింది. అందుకే అధికార పక్షం, ప్రతిపక్షం ఉండేలా ఒక పూర్తిస్థాయి పార్లమెంటరీ నమూనాను రూపకల్పన చేసింది. దీనిద్వారా విద్యార్థులు కేవలం తమ సమస్యలపై గళమెత్తడమే కాకుండా, ఒకరికొకరు బాధ్యతాయుతంగా ఉంటూ భిన్నమైన అభిప్రాయాలను అర్థం చేసుకోవడం, చర్చించడం నేర్చుకున్నారు.

టీచ్ ఫర్ ఇండియా ఫెలోస్ నేర్పించిన విలువల పునాదిపై రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం, విద్యారంగంలో సమానత్వం కోసం పనిచేసే నాయకులను తీర్చిదిద్దాలనే ఆ సంస్థ లక్ష్యానికి అనుగుణంగా నిలిచింది. ఈ మాక్ పార్లమెంట్ అనేది విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా, తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బాధ్యతగా స్వీకరించే క్రియాశీలక భాగస్వాములుగా మార్చింది. వారు క్షేత్రస్థాయి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడమే కాకుండా, సానుభూతి, బాధ్యతాయుతమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఇది దోహదపడింది.

తనలోని ఆత్మవిశ్వాసాన్ని, భావప్రకటనా సామర్థ్యాన్ని పెంచడంలో తన తరగతి గది వాతావరణమే కీలక పాత్ర పోషించిందని సఫూరా చెబుతోంది. చిన్నప్పటి నుంచే ఆలోచనలను ధైర్యంగా పంచుకునేలా ప్రోత్సహించడం, సామాజిక మార్పు కోసం శ్రమించే వ్యక్తులు మరియు నిజ జీవిత వేదికలను పరిచయం చేయడం ద్వారా ఆమె ఫెలోస్ నాయకత్వానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించారు. సమస్యలకు సిద్ధంగా ఉన్న పరిష్కారాలను నేరుగా అందివ్వకుండా, స్వీయ పరిశీలన మరియు సమస్యల పరిష్కార మార్గాల ద్వారా ఆమెకు మార్గదర్శకత్వం వహించారు. దాంతో ఆమె స్వయంగా ప్రయోగాలు చేస్తూ, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఒక నాయకురాలిగా ఎదిగేందుకు అవకాశం లభించింది.

అయితే, ఈ పార్లమెంట్‌ను నిర్మించడం తీవ్రమైన సవాళ్లతో కూడుకున్న పనిగా మారింది. తోటి విద్యార్థులు, ఫెలోస్ ఆమెకు మద్దతుగా నిలిచినప్పటికీ, ప్రారంభంలో పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ఒప్పించడానికి ఆమె ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అయితే సమయం గడిచేకొద్దీ, వారు ఈ ఆవిష్కరణలోని ప్రాముఖ్యతను గుర్తించి పూర్తి మద్దతును అందించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఆమె విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగింది.

నిర్వహణ పరమైన సవాళ్లు కూడా ఈ వ్యవస్థకు పెద్ద పరీక్షగా నిలిచాయి. అధికార పక్షం, ప్రతిపక్షం హోదాలు మారే లీడర్‌షిప్ బదిలీ సమయంలో, విద్యార్థులు కొత్త బాధ్యతలకు అలవాటు పడలేక పార్లమెంట్ కార్యకలాపాలు పూర్తిగా స్థంభించిపోయేవి. ఈ పరిస్థితిని అధిగమించడానికి సఫూరా, ఆమె బృందం ట్రాన్సిషన్ గైడ్‌లు, మెంటరింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఇవి విద్యార్థులు తమ కొత్త బాధ్యతలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. మరోవైపు వ్యక్తిగతంగా కూడా ఆమె ఎలాంటి ముందస్తు సన్నాహాలు లేకుండానే అనుకోకుండా నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చేది. అటువంటి సమయాల్లో ముందుగా రాసిపెట్టుకున్న సమాధానాల కంటే ఆలోచనా స్పష్టత, అనుసరించే విలువలపైనే ఆధారపడటం ఆమెకు అలవాటైంది.

మరోవైపు, బోర్డు పరీక్షల సమయంలో చదువుతో పాటు పాఠశాల స్థాయి కార్యక్రమాన్ని నడపడం ఆమెకు మరో పెద్ద సవాలుగా మారింది. అయితే ఫెలోస్ అందించిన సహకారంతో సఫూరా బాధ్యతలను ఇతరులకు అప్పగించడం, స్పష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం నేర్చుకుంది. పనుల విభజన, సమయ పరిమితులు, బాధ్యతల కేటాయింపు ద్వారా సమయాన్ని సరిగ్గా మేనేజ్ చేయడం అలవాటు చేసుకుంది.

నేడు ఈ మాక్ పార్లమెంట్ అనేది ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంసమృద్ధిగా నడిచే ఒక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. గత నాలుగేళ్లుగా ఆమె జూనియర్లు దీనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వ్యక్తులపై మాత్రమే ఆధారపడకుండా సఫూరా నిర్మించిన బలమైన వ్యవస్థలే దీని విజయానికి ప్రధాన కారణం. నాయకత్వం అనేది ఆచరణతోనే మొదలవుతుందని, ఆశయానికి తోడు బలమైన వ్యవస్థలు ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుందనే ముఖ్యమైన సూత్రాలను బదిలీ చేస్తూ ఆమె ఈ కార్యక్రమం నిరంతరం సాగేలా పునాది వేసింది.

ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిన ప్రధాన అంశం ఏమిటంటే, కాలక్రమేణా ఇది రూపాంతరం చెందిన తీరే. ఆమె జూనియర్లు ఈ నమూనాను కొనసాగించడమే కాకుండా, విద్యార్థుల నేతృత్వంలో కొత్త కార్యక్రమాలను తీసుకురావడం, ప్రస్తుత సవాళ్లకు అనుగుణంగా ఈ వ్యవస్థను మార్చుకోవడం వంటి కొత్త ఆలోచనలతో దీనిని మరింత విస్తరించారు. ఈ వేదిక నేటికీ సమర్థవం చర్చలకు, బాధ్యతారాహిత్యాన్ని వీడి బాధ్యతగా మెలగడానికి, నిజ జీవిత అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి ఒక వేదికగా నిలుస్తోంది.

సఫూరా ప్రయాణం ‘టీచ్ ఫర్ ఇండియా’ తీసుకొచ్చిన లోతైన మార్పునకు ఒక నిదర్శనం. ఇక్కడ తరగతులు విద్యార్థుల్లోని నాయకత్వ పటిమను, స్వయంశక్తిని వెలికితీసే కేంద్రాలుగా మారుతాయి. సామాజిక న్యాయం పట్ల ఉన్న బలమైన తపన, సమాజంలోని అసమానతలను తొలగించాలనే ఆకాంక్షతో ఆమె ఇప్పుడు ప్రజా జీవితంలోకి ప్రవేశించాలని అనుకుంటోంది. నాయకత్వం అంటే కేవలం అధికారం మాత్రమే కాదని, అది అందరినీ భాగస్వాములను చేస్తూ, జవాబుదారీతనంతో, సేవా భావంతో కూడి ఉండాలని ఆమె భావిస్తోంది. విద్యార్థులకు సరైన ప్రోత్సాహం, అవకాశాలు లభించినప్పుడు వారు మార్పు గురించి కేవలం చదువుకోవడమే కాదు, ఆ మార్పుకు తామే స్వయంగా నాయకత్వం వహిస్తారనే శక్తివంతమైన నమ్మకాన్ని సఫూరా జీవితం మరోసారి నిరూపిస్తోంది.