కేటీఆర్‌కు జూపల్లి సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా!

  • చర్చకు సిద్ధమా..? టీఆర్ఎస్ కార్యాలయానికే వస్తానన్న మంత్రి
  • బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు.. కాంగ్రెస్ హామీలను సమర్థించిన జూపల్లి
  • రుణమాఫీ, అప్పులు, అభివృద్ధిపై కేటీఆర్‌కు బహిరంగ సవాల్
  • తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్‌నే: మంత్రి
  • ‘లెక్కలు తప్పని నిరూపిస్తే స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇస్తా’
  • హరీష్‌రావు, కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చిన జూపల్లి

నాగర్‌కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ: తాను వెల్లడించిన ఆర్థిక లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్‌కు లేఖ ఇస్తానని రాష్ట్ర మంత్రి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమైతే తానే టీఆర్ఎస్ కార్యాలయానికి వస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి మాట్లాడిన మంత్రి జూపల్లి.. బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలంగాణను మిగులు రాష్ట్రం నుంచి రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల రాష్ట్రంగా మార్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన నిజంగా గొప్పదైతే ప్రజలు ఎందుకు గద్దె దించారని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు.

రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.20,157 కోట్ల రుణాలను మాఫీ చేసి చరిత్ర సృష్టించిందని, అదే బీఆర్ఎస్ నాలుగేళ్లు తీసుకుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతుబంధు నిధుల కోసం ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆరోపించారు.

దళితులకు మూడెకరాల భూమి, రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆశయాలకు విరుద్ధంగా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో పాలన సాగిందని మండిపడ్డారు.

హైదరాబాద్ అభివృద్ధిపై బీఆర్ఎస్ చెప్పుకునే ఘనతలో ఎక్కువ భాగం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధేనని పేర్కొన్నారు. ప్రగతి భవన్, కొత్త సచివాలయం వంటి నిర్మాణాలపై భారీగా ప్రజాధనం ఖర్చు చేసి ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.