100daysactionplan | ‘జలధార’తో.. నీటి భద్రత

100daysactionplan | ‘జలధార’తో.. నీటి భద్రత

100daysactionplan | భూగర్భ జలాల పునరుద్ధరణకు సమగ్ర చర్యలు
జిల్లాలో 439 చెరువులు, 22 కాలువల పునరుద్ధరణ
రూ.25.5 కోట్ల నిధులతో ప్రణాళిక
ఎన్‌ఆర్‌జీఎస్‌తో ఉపాధి–నీటి సంరక్షణ బహుళ ప్రయోజనం
నీటి లోటు 3.2 టీఎంసీలు.. భర్తీ లక్ష్యంగా అధికారుల చర్యలు
రెడ్డిగూడెం, ఏ.కొండూరు మండలాలపై ప్రత్యేక దృష్టి
మిష‌న్ అమలుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్

100daysactionplan |ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వాతావరణ మార్పులు, తగ్గుతున్న వర్షపాతం నేపథ్యంలో నీటి భద్రతను కాపాడుకోవడం అత్యవసరంగా మారిన వేళ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ‘జలధార’ యాక్షన్ ప్లాన్‌తో ముందడుగు వేసింది. మాన్సూన్‌కు ముందు, తర్వాత నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా 100 రోజుల సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

నిల్వ సామర్థ్యం పెంచే దిశగా..
జిల్లా వ్యాప్తంగా నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచడం, భూగర్భ జలాలను పునరుద్ధరించడం లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రణాళికలో భాగంగా 439 చెరువులు, 22 ప్రధాన కాలువలను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 6.8 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. 3.2 టీఎంసీల లోటును భర్తీ చేయడమే ఈ యాక్షన్ ప్లాన్ ప్రధాన లక్ష్యం. పాలేరు, మున్నేరు, బుడమేరు, కృష్ణానది పరిధిలోని కాలువల పునరుద్ధరణ పనులను ఈ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టనున్నారు. కాలువల్లో పూడికతీత, గట్ల బలోపేతం, జంగిల్ క్లియరెన్స్ వంటి చర్యలు నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. 184 కాలువ మరమ్మతు పనులు, 61 చెరువుల పూడికతీత పనులు, 73 జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడం ద్వారా సమగ్ర ఫలితాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

100daysactionplan
100daysactionplan

ఎన్‌ఆర్‌జీఎస్‌తో అనుసంధానం చేస్తూ…
జిల్లావ్యాప్తంగా చేపడుతున్న జలధార పనులన్నీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌జీఎస్) ద్వారా నిర్వహించడం విశేషం. రూ.25.5 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రణాళికలో రూ.19 కోట్లు కార్మికులకు, రూ.6.5 కోట్లు మెటీరియల్ ఖర్చులకు కేటాయించడం ద్వారా గ్రామీణ ఉపాధి అవకాశాలు కూడా పెరుగనున్నాయి. వ్యవసాయ పనులు లేని ఈ సీజన్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు లభించడం, వారికి భ‌త్యము ఉపాధి లభించే అవకాశం కలుగుతుంది. ఎన్ ఆర్ జీ ఎస్, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా ఈ యాక్షన్ ప్లాన్ ను రూపొందించి అమలు చేస్తుండగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ ప్రత్యేక పర్యవేక్షణలో పనులు ఊపొందుకోనున్నాయి.

ఆ రెండు మండలాల పై ప్రత్యేక దృష్టి
భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న జిల్లాలోని రెడ్డిగూడెం (11.7 మీటర్లు), ఏ.కొండూరు (8.22 మీటర్లు) మండలాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. చెట్ల మధ్య రీచార్జ్ గుంతలు, కొండల పరీవాహ ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, గట్లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నేలలోకి ఇంకేలా ప్రణాళిక రూపొందించారు. ప్రధాన కాలువల వెంబడి ఆక్రమణల తొలగింపు, పూడికల తీత, కాలువల్లో నీటిని పెద్ద ఎత్తున నిల్వ చేసేలా పనులను రూపొందించారు. అదేవిధంగా కాలువలు, చెరువుల ఆక్రమణలను తొలగించడం, నీటి మార్గాలను శుభ్రపరచడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించాలన్నది అధికారుల లక్ష్యం. ఈ చర్యలతో భూగర్భ జలాలు పెరిగి బోర్లపై ఆధారపడటం తగ్గడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశముంది.

బహుళ ప్రయోజనకరంగా…
జిల్లా వ్యాప్తంగా జలధార ద్వారా చేపడుతున్న ఈ యాక్షన్ ప్లాన్ లో భాగంగా వ్యవసాయం, ముఖ్యంగా తోటల సాగు (హార్టికల్చర్) కోసం నీటి లభ్యత మెరుగుపడటంతో రైతులకు ఊరట కలగనుంది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, కాలుష్యం తగ్గింపు వంటి అనేక ప్రయోజనాలు ఈ ప్రణాళిక ద్వారా సాధ్యమవుతాయని అంచనా వేస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు
ఇటీవలి కాలంలో భూగర్భ జలాల అధిక వినియోగం, అస్తవ్యస్త వర్షపాతం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళికతో నీటి వనరులను సంరక్షించడం అత్యవసరం. “జలధార” వంటి సమగ్ర చర్యలు సరైన అమలు జరిగితే, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, దీర్ఘకాలిక నీటి భద్రతకు బలమైన పునాది కావచ్చు. అందుకే ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సమ‌ష్టిగా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పక్క ప్రణాళికతో పనులను వేగవంతం చేస్తూ నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేసే విధంగా సన్నద్ధమై ఉన్నారు.

click here to read more

click here to read ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

కృష్ణాజిల్లా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply