హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే చండీగఢ్ గుర్తుకు వస్తుందని రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఐటీ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయం ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) ను కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతోందని ఈ నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా “ఫ్యూచర్ సిటీ” పేరిట ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ పరిధి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 770 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీని అన్ని సదుపాయాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు “ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ”ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందన్నారు.
దుమారం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు వ్యాఖ్యలు
మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఫోర్త్ సిటీ కాదు, ఫోర్ బ్రదర్స్ సిటీ కడుతున్నారని శంభీపూర్ రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవన్నారు. దాంతో తాను ఎవరి పేరు తీసుకోలేదని, శాసనసభలో అంతకన్నా దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మండలి చైర్మన్ కలుగు చేసుకుని ఇక్కడ అలాంటివి మాట్లాడొద్దు అని సూచించారు. ఇక్కడ ఓ రూల్, ఓ పద్దతి ఉందని, దాని ప్రకారమే మాట్లాడాలని సూచించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ శంబీపూర్ రాజు శాసనసభకు రావాలని అక్కడ ఆ రకమైన సమాధాం చెబుతామన్నారు. ఇది పెద్దల సభ… ఇది ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.