ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
- కలెక్టర్ డా. ఏ. సిరి
వెల్దుర్తి, ఆంధ్రప్రభ: “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరినీ బడిలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెల్దుర్తి మండలం హరిజనవాడలో జరిగిన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో ఆమె స్వయంగా పాల్గొన్నారు.
వెల్దుర్తిలోని పలు ఇళ్లకు స్వయంగా వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం మరియు ఉచిత పుస్తకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
వెల్దుర్తి ఎంపీపీ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన 41 మంది విద్యార్థులు, సమీప ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో చేరడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అంగన్‌వాడీ పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించి, తల్లిదండ్రులకు అడ్మిషన్ పత్రాలను అందజేశారు.
విద్యార్థులు ప్రతిరోజూ డిక్షనరీ చూస్తూ కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలని, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ నీరు తాగాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఉపాధ్యాయులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్థానిక తల్లులు కలెక్టర్ వద్ద హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎంత బాగా శ్రద్ధ తీసుకుంటే బడిలో పిల్లల సంఖ్య అంత పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుధాకర్, ఎస్ఎస్‌ఏ పీఓ లోకరాజ్ మరియు ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

