జెడ్పీహెచ్‌ఎస్‌లో మౌలిక సదుపాయాలపై సోషల్ ఆడిట్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బెజ్జోరా జెడ్పీహెచ్‌ఎస్‌లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సీఈఎస్ఎస్ ఇన్వెస్టిగేటర్ ఎం. హాసిని శనివారం పాఠశాల మౌలిక సదుపాయాలపై సోషల్ ఆడిట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడితో కలిసి ప్రయోగశాల పరికరాలు, గ్రంథాలయం, పుస్తకాల లభ్యత, కంప్యూటర్లు, క్రీడా సామగ్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డ్యూయల్ డెస్కులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, తరగతి గదులు, విద్యుత్, ప్రహరీ గోడ తదితర సదుపాయాలను పరిశీలించారు.
అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల హాజరు, పాఠశాలలో ప్రవేశాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యాబోధన, అందుతున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గుర్తించిన అవసరాలు, లోపాలను సమగ్ర నివేదిక రూపంలో సిద్ధం చేసి సంబంధిత అధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సోషల్ ఆడిట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
